బీసీ వెల్ఫేర్​ హాస్టల్​లో విద్యార్థులకు అస్వస్థత

బీసీ వెల్ఫేర్​ హాస్టల్​లో విద్యార్థులకు అస్వస్థత
  • 15 మంది విద్యార్థులకు అస్వస్థత
  •  సరూర్​నగర్​ పరిధిలోని 
  •  బీసీ వెల్ఫేర్​ హాస్టల్​లో ఘటన
  •  కలుషిత నీరు తాగడంతోనేనని విద్యార్థుల ఆందోళన

ఎల్​బీనగర్,వెలుగు: సరూర్ నగర్ పరిధి పంజాల అనిల్ కుమార్ కాలనీలో ఏర్పాటైన మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ హాస్టల్ లోని 5,6,7వ తరగతులకు చెందిన  విద్యార్థులు శుక్రవారం రాత్రి అన్నం తిన్న తర్వాత అస్వస్థతకు గురయ్యారు. వెంటనే బాధిత విద్యార్థులను 108 అంబులెన్స్ ల్లో ఉస్మానియాకు తరలించారు. అక్కడ అడ్మిట్ చేసుకోకపోవడంతో నీలోఫర్ కి తరలించి ట్రీట్​మెంట్​ అందిస్తున్నారు.  సొసైటీ హాస్టల్ లో ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు 800 మంది విద్యార్థులు చదువుతున్నారు.  వారం రోజులుగా హాస్టల్ లో తాగునీరు, ఇతర అవసరాలకు నీరు లేకపోగా తీవ్ర ఇబ్బందులు పడ్డామని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు రోజులుగా  స్నానాలు, కనీసం టాయిలెట్​కు వెళ్లేందుకు కూడా నీరు లేదని వాపోయారు. స్నానాలు చేయకపోవడంతో అలర్జీ, జ్వరాలు వచ్చి అస్వస్థతకు గురైనట్లు విద్యార్థులు తెలిపారు.  హాస్టల్ లో నీటి సమస్యపై ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకో లేదని పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి  అన్నం తిన్న తర్వాత తాగునీరు లేక బోరు నీరు తాగడంతోనే విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు, అందులో 15 మందిని ఆసుపత్రికి తరలించినట్లు సహా విద్యార్థులు తెలిపారు. ఆసుపత్రిలో అడ్మిట్ అయిన విద్యార్థుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు,  ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నట్లు నీలోఫర్ డాక్టర్లు చెప్పారు.  హాస్టల్ లోని సమస్యలు, విద్యార్థుల అస్వస్థతపై హాస్టల్ ఇన్​చార్జి ని వివరణ కోరగా నిరాకరించడంతో పలు అనుమానాలకు తావిస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.