Weather News : ఇవాళ ( మే 27 ) హైదరాబాద్ సిటీలో వర్షం : ఈ జిల్లాల్లో వాన బీభత్సం

Weather News : ఇవాళ ( మే 27 ) హైదరాబాద్ సిటీలో వర్షం : ఈ జిల్లాల్లో వాన బీభత్సం

తెలంగాణలోని పలు జిల్లాల్లో గాలి వాన బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. బుధవారం ( మే 27 ) అర్థరాత్రి  నుండి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి రాష్ట్రం చల్లబడింది. ఈ క్రమంలో రాబోయే రెండు, మూడు గంటల పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.10 గంటల నుండి ఒంటి గంట వరకు వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. 

నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, జిల్లాలలో తదుపరి 2-3 గంటల్లో మోస్తరు వర్షం కురిసే ఛాన్స్ ఉండడంతో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ జిల్లల్లో గంటకు 41 - 61 కిలోమీటర్ల మధ్య గరిష్ట ఉపరితల గాలి వేగంతో, మోస్తరు ఉరుములతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం వుందని తెలిపింది.

భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జోగులాంబ గద్వాల్, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, సంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, జిల్లాలలో తదుపరి 2-3 గంటల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఈ జిల్లాలో గరిష్ట ఉపరితల గాలి వేగం గంటకు 40 కి.మీ కంటే తక్కువ ఉంటుందని.. తేలికపాటి ఉరుములతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం వుందని తెలిపింది.వర్షం కురిసే సమయంలో ఈదురుగాలులు బలంగా వీచే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ.

సీఎం రేవంత్ ఆదేశాలు:

వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన క్రమంలో వర్షాలపై సీఎం రేవంత్  అధికారులను అప్రమత్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 

కల్లాల్లోని ధాన్యం తడవకుండా అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇప్పటికే కొనుగోళ్లు పూర్తైన కేంద్రాల నుంచి టార్పాలిన్లను తరలించాలని అన్నారు.బలమైన ఈదురుగాలులు వీస్తాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరించిన క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు.