భయపడినట్లే జరుగుతుంది.. భారతదేశంలో ఈసారి సాధారణ వర్షాలు కూడా పడే అవకాశం లేదని.. సాధారణ వర్షపాతం 90 శాతంగానే ఉంటుందని స్పష్టం చేసింది భారత వాతావరణ శాఖ. రాబోయే వర్షాకాలం, నైరుతి రుతు పవనాలకు సంబంధించి 2026, మే 29వ తేదీ IMD.. భారత వాతావరణ శాఖ తన నివేదికను వెల్లడించింది. రాబోయే కరువును.. విపత్తుపై హెచ్చరికలు జారీ చేయటం ఆందోళన కలిగిస్తోంది.
రాబోయే జూన్, జూలై నెలల్లో సాధారణ వర్షపాతం కంటే తక్కువగానే వానలు పడతాయని స్పష్టం చేసింది. జూన్, జూలై నెలల్లో ఎల్ నినో పరిస్థితులు ఏర్పడతాయని స్పష్టం చేసింది ఐఎండీ. ఎల్ నినో అంటే పసిఫిక్ మహా సముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగటం అన్నమాట. దీన్ని ఎల్ నినోగా పిలుస్తారు. దీని వల్ల వర్షాలు నైరుతి రుతుపవనాలు బలహీనపడి.. వర్షాలు తక్కువగా పడతాయి.
జూన్, జూలై నెలల్లోనే ఈ ఎల్ నినో ప్రభావం వల్ల సాధారణం కంటే 10 శాతం తక్కువ వర్షాలు పడతాయని.. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నాటికి ఎల్ నినో బలపడి.. వర్షాలు లేక వ్యవసాయంపై కరువు ప్రభావం చూపిస్తుందని హెచ్చరించింది భారత వాతావరణ శాఖ.
ఎల్ నినో ప్రభావంతో రాజస్థాన్, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జమ్మూకాశ్మీర్, ఢిల్లీ, చంఢీఘర్ రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు పడతాయని స్పష్టం చేసింది ఐఎండీ.
తెలంగాణ, ఆంధ్ర, కర్నాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో సాధారణం.. అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది ఐఎండీ. దక్షిణాది రాష్ట్రాలపైనా ఎల్ నినో ప్రభావం ఉన్నా.. కొన్ని చోట్ల అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.
ఓవరాల్ గా భారతదేశం అంతా చూస్తే మాత్రం ఈసారి సాధారణ వర్షపాతం కూడా లేదు. దీని వల్ల వ్యవసాయ రంగంపై ఒత్తిడి పెరుగుతుందని.. నీటి కష్టాలు వస్తాయని.. వర్షపాతంపై ఆధారపడి చేసే పంటల సాగు తగ్గవచ్చని హెచ్చరించింది ఐఎండీ.
కేరళ నుంచి మొదలయ్యే నైరుతి రుతుపవనాల కాలంలో వర్షాలు 70 శాతం వాటా కలిగి ఉన్నాయని.. ఖరీఫ్ పంటల సాగు అనేది దేశ ఆహార ఉత్పత్తికి కీలకం అని.. ఈసారి ఎల్ నినో ప్రభావంతో అది సంక్షోభానికి దారితీయొచ్చని హెచ్చరించింది ఐఎండీ.
