
హైదరాబాద్ వ్యాప్తంగా మరో రెండు గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. శుక్రవారం ( జులై 18 ) ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.హైదరాబాద్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సెంట్రల్ జోన్లకు వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ.
రాష్ట్రంలో హైదరాబాద్ జనగాం, మహబూబ్నగర్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వర్షం కురిసే ఛాన్స్ ఉందని.. వర్షంతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. ఇవాళ మధ్యాహ్నం 02:30 గంటల నుండి సాయంత్రం 05:30 గంటల వరకు భారీ వర్షం కురువనున్న ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు అధికారులు. భారీ వర్షం హెచ్చరికలతో హైదరాబాదులో హైడ్రా, జిహెచ్ఎంసి, మాన్ సూన్ ఎమర్జెన్సీ సిబ్బంది అలర్ట్ అయ్యారు.
ఇదిలా ఉండగా.. గురువారం ( జులై 17 ) సాయంత్రం కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం కురవడంతో ట్రాఫిక్ జామ్ వల్ల జనం నరకయాతన పడ్డారు. సుమారు మూడు వారల తర్వాత కురిసిన వర్షానికి కాస్త రిలీఫ్ లభించినప్పటికీ నగరవాసులకు ట్రాఫిక్ జామ్ చుక్కలు చూపించింది.
ALSO READ : నిందలు వేయటం తప్ప సీఎం రేవంత్ చేసిందేమీ లేదు.. బనకచర్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్, మణికొండ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్, ఖైరతాబాద్, లక్డీ కా పూల్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షం దెబ్బకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆఫీస్లు ముగించుకుని సాయంత్రం ఇళ్లకు వెళుతున్న ఉద్యోగులు ట్రాఫిక్లో చిక్కుకుపోయి నానా యాతన పడ్డారు.
శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్ ప్రాంతాలలో కూడా వర్షం కురిసింది. కేబీఆర్ పార్క్, పరిసర ప్రాంతాల్లో వర్షం దంచికొట్టడంతో ఫుల్ ట్రాఫిక్ జాం అయింది. వాయుగుండం కారణంగా తెలంగాణకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. గురు, శుక్ర, శనివారం.. ఈ మూడు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ.
హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, మేడ్చల్ మల్కాజిగిరి, ములుగు, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని కూడా తెలిపింది. జనగాం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు మోస్తారు వర్ష సూచన చేసింది.