- మళ్లీ గడువు అడుగుడేంది? ఏపీపై కేడబ్ల్యూడీటీ2 ఆగ్రహం
- తెలంగాణ ఎస్వోసీకి కౌంటర్ దాఖలు చేయకపోవడంపై అసహనం
హైదరాబాద్, వెలుగు : ఏపీ అధికారులపై కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 2 (కేడబ్ల్యూడీటీ –2 బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్) ఆగ్రహం వ్యక్తం చేసింది. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ దాఖలు చేసిన స్టేట్మెంట్ ఆఫ్ కేస్ (ఎస్వోసీ)పై కౌంటర్ దాఖలు చేయడంలో ఆలస్యంపై అసహనం వ్యక్తం చేసింది. కుంటిసాకులు చెప్పొద్దంటూ మండిపడింది.
కౌంటర్ దాఖలు చేసేందుకు ఇప్పటికే నాలుగు వారాల గడువు ఇచ్చామని, మళ్లీ ఇప్పుడు మరో నాలుగు వారాల గడువు అడగడం ఏంటని నిలదీసింది. సోమవారం ట్రిబ్యునల్ ముందు రెండు రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు. ఇటీవలే ఎన్నికలు అయిపోయాయని, ప్రభుత్వం మారడంతో ఎస్వోసీలోని అంశాలను మరోసారి స్టడీ చేయాల్సిన అవసరం ఉందని ఏపీ వాదించింది. తెలంగాణ ఎస్వోసీపై కౌంటర్ దాఖలు చేసేందుకు మరో నాలుగు వారాల గడువు కావాలని ఏపీ తరఫున అడ్వకేట్ జయదీప్ గుప్తా కోరారు.
అయితే, ఏపీ వాదనను... తెలంగాణ తరఫున వాదిస్తున్న అడ్వకేట్ సీఎస్ వైద్యనాథన్ తోసిపుచ్చారు. కృష్ణా జలాలకు సంబంధించిన కేసులపై ఏపీ కౌంటర్లు దాఖలు చేస్తున్నదని, కానీ.. ట్రిబ్యునల్ ముందు మాత్రం కుంటి సాకులు చెప్తున్నదని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్.. చివరి అవకాశంగా మరో నాలుగు వారాల గడువు ఇస్తున్నట్టు తెలిపింది.
ఈసారి కౌంటర్ దాఖలు చేయడంలో ఫెయిల్ అయితే ఏపీ వాదనలను పరిగణనలోకి తీసుకోబోమని, రైట్ టు ఫైల్‌ను రద్దు చేస్తామని హెచ్చరించింది. మరో చాన్స్ ఇచ్చేది లేదని, ఏపీ కౌంటర్ లేకుండానే కేసును విచారిస్తామని తేల్చి చెప్పింది. అంతేగాకుండా రెండు రాష్ట్రాలు తమ తమ ఎస్వోసీ కౌంటర్లకు రిజాయిండర్లను దాఖలు చేసేందుకు రెండు వారాల గడువును ఇచ్చింది. తదుపరి విచారణను ఆగస్టు 28, 29వ తేదీలకు వాయిదా వేసింది.
-
మే 15వ తేదీ నాటికే వేయాల్సింది..
వాస్తవానికి మే 15వ తేదీ నాటికే రెండు రాష్ట్రాలు ఎస్వోసీలకు కౌంటర్లను దాఖలు చేయాల్సి ఉంది. అయితే, ఏపీతో పాటు సార్వత్రిక ఎన్నికలు, తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలుండడంతో కౌంటర్ల దాఖలుకు మరో నాలుగు వారాల గడువును ఇచ్చింది. జూన్‌లోనే తెలంగాణ కౌంటర్‌ను దాఖలు చేసింది. అయితే, ఏపీ మాత్రం అక్కడ సర్కార్ మారడంతో మరో నాలుగు వారాల గడువు కావాలని కోరింది.
ఈ నేపథ్యంలోనే ఏపీ తీరుపై ట్రిబ్యునల్ అసహనం వ్యక్తం చేస్తూనే మరో అవకాశం ఇచ్చింది. కాగా, ఈ విచా రణలో తెలంగాణ తరఫున ఇంటర్ స్టేట్ వాటర్ రిజల్యూషన్స్ ఎస్ఈఎస్ విజయ్ కుమార్, ఈఈ పీ.విజయ్ కుమార్, ఏఈ అనురాగ్ శర్మ హాజరయ్యారు. ఏపీ నుంచి ఈఈ గిరిధర్ రావు, డీఈఈ శ్రీనివాస్ విచారణకు అటెండ్ అయ్యారు.