V6 News

ఫార్మా కంపెనీల తప్పులకు ఇక కోర్టు కేసుల్లేవు..తప్పు చేస్తే జైలుకు బదులు ఫైన్

ఫార్మా కంపెనీల తప్పులకు ఇక కోర్టు కేసుల్లేవు..తప్పు చేస్తే జైలుకు బదులు  ఫైన్
  • రాష్ట్రంలో అమల్లోకి జన విశ్వాస్ రూల్స్
  • తప్పు చేస్తే జైలుకు బదులు 
  • ఫైన్ కట్టేలా వెసులుబాటు 
  • కాంపౌండింగ్ అథారిటీకి సర్వ అధికారాలు
  • తప్పు చేస్తే జైలుకు బదులు ఫైన్ కట్టేలా వెసులుబాటు 
  • కంపౌండింగ్ అథారిటీకి సర్వ అధికారాలు 


హైదరాబాద్, వెలుగు: ఫార్మా కంపెనీలు, మెడికల్ షాపుల యజమానులకు ఊరటనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెడిసిన్ల తయారీ, విక్రయాల్లో తలెత్తే సాంకేతిక లోపాలకు ఇకపై కోర్టుల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా, కేవలం జరిమానా చెల్లించడం ద్వారా కేసులను పరిష్కరించుకునే వెసులుబాటు కల్పించింది. కేంద్రం తీసుకొచ్చిన 'జన్ విశ్వాస్ చట్టం-2023' ఆధారంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ జీవో 21ను విడుదల చేసింది. డీసీఏ డైరెక్టర్ జనరల్ షానవాజ్ ఖాసింను కాంపౌండింగ్ అథారిటీగా నియమించింది. దీనివల్ల ప్యాకింగ్‌‌పై వివరాల తప్పులు, మెడికల్ షాపుల్లో రికార్డుల నిర్వహణ లోపాలు వంటి అంశాల్లో అనవసర లిటిగేషన్లు తగ్గి, కోర్టులపై భారం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇది 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'లో భాగంగా వ్యాపారులకు పెద్ద ఉపశమనంగా మారనుంది.

టెక్నికల్ లోపాల పేరుతో...

డ్రగ్ అండ్ కాస్మొటిక్ యాక్ట్, సెక్షన్ 27 ప్రకారం.. మందుల నాణ్యత, విక్రయాల్లో జరిగే నేరాలను ప్రధానంగా నాలుగు విభాగాలుగా (27 A,B,C,D) చూస్తారు. ఇందులో 27(A, B, C) కింద వచ్చే నకిలీ, కల్తీ మందుల తయారీదారులకు కఠిన శిక్షలు, జీవిత ఖైదు వరకు యథాతథంగా ఉంటాయి.అయితే, 27(D) విభాగం కిందకు వచ్చే సాంకేతిక లోపాలు, సబ్ స్టాండర్డ్ మందుల విషయంలోనే ప్రభుత్వం ఇప్పుడు వెసులుబాటు తెచ్చింది. ఉదాహరణకు మనం వేసుకున్న టాబ్లెట్ కడుపులోకి వెళ్లాక నిర్ణీత సమయంలో కరిగి రక్తంలో కలవాలి. అది కరగకపోయినా, ఆలస్యంగా కరిగినా రోగికి మెడిసిన్ అందదు. ఇప్పటిదాకా దీనిని తీవ్రమైన నేరంగా చూస్తూ రూ. 20 వేల జరిమానాతో పాటు రెండేండ్ల వరకు జైలు శిక్ష విధించేవారు. కానీ, కొత్త నిబంధనల ప్రకారం... ఇది కేవలం ఫైన్‌‌తో సరిపెట్టే చిన్న తప్పు మాత్రమే. టాబ్లెట్‌‌ లో ఉండాల్సిన అసలైన రసాయనం తక్కువగా ఉన్నా, ప్యాకింగ్ మీద వివరాలు తప్పుగా ఉన్నా, మెడికల్ షాపుల్లో రికార్డులు సరిగ్గా లేకపోయినా ఇకపై కోర్టుకు వెళ్లాల్సిన పనిలేదు. కంపౌండింగ్ అథారిటీ నిర్ణయించిన పెనాల్టీ చెల్లిస్తే సరిపోతుంది. కాంపౌండింగ్ అథారిటీగా డీసీఏ డీజీ ఇకపై ఏ కేసులో ఫైన్ వేయాలో డిసైడ్ చేస్తారు. అయితే, ఒక ఫార్మా కంపెనీ, మెడికల్ షాపు మొదటిసారి చేసిన తప్పుకు మాత్రమే వెసులుబాటు ఉంటుంది. 

ఫార్మా రంగానికి మంచిదే కానీ.. 

గతంలో మెడిసిన్లపై చిన్న అక్షరం తప్పున్నా, రికార్డుల్లో స్వల్ప పొరపాటు దొర్లినా యజమానులను ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది. చివరకు చిన్న ఫైన్ పడే కేసు కోసం లక్షల రూపాయలు లాయర్లకు, కోర్టులకు ఖర్చు చేయాల్సి వచ్చేది. ఈ కొత్త నిబంధనల వల్ల అనవసరమైన లిటిగేషన్లు తగ్గి, కోర్టుల్లో వేలాదిగా పేరుకుపోయిన డ్రగ్ కేసుల భారం తగ్గుతుంది.  ఇది ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’కు ఊతమిస్తుంది. అయితే, ప్రాణరక్షక ఔషధాల విషయంలో చట్టాలను సరళతరం చేయడం సామాన్యులకు చేటు చేస్తుందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.మందు సరిగ్గా పనిచేయకపోయినా, పవర్ తక్కువగా ఉన్నా అది టెక్నికల్ లోపం అని సర్టిఫై చేయడం ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  జరిమానా చెల్లిస్తే తప్పులన్నీ మరుగున పడిపోయే ఈ విధానం.. కంపెనీల్లో నిర్లక్ష్యాన్ని పెంచి ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసినట్లు అవుతుందా? అన్నది వేచి చూడాలి.