నిన్న పదేండ్లు.. ఇయ్యాల పద్నాలుగు .. ఇమ్రాన్ ఖాన్​​కు మళ్లీ జైలు

నిన్న పదేండ్లు.. ఇయ్యాల పద్నాలుగు .. ఇమ్రాన్ ఖాన్​​కు మళ్లీ జైలు

 

  • పాక్​ మాజీ ప్రధానికి వరుస ఎదురు దెబ్బలు

ఇస్లామాబాద్: పాక్​ మాజీ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​కు, ఆయన భార్య బుష్రాకు తోషఖానా కేసులో కోర్టు14 ఏండ్ల జైలు శిక్ష విధించింది. అధికారిక రహస్య పత్రాల దుర్వినియోగం కేసులో అంతకు ముందు రోజే ఆయనకు పదేండ్ల జైలు శిక్ష పడింది. పాక్​ ఎన్నికలకు ముందు ఆయనకు వరుస షాక్​లు తగిలాయి. ఇమ్రాన్ ఖాన్ పాక్​ ప్రధానిగా ఉన్న సమయంలో ఇరువురు దంపతులు దేశాధినేతలు, తదితరుల నుంచి 58 ఖరీదైన కానుకలు అందుకున్నారు.

పదవి నుంచి వైదొలగిన తర్వాత వాటిని తోషఖానాలో జమ చేయాలి. లేదంటే నిబంధనల ప్రకారం సగం ధర చెల్లించి వాటిని సొంతం చేసుకోవచ్చు. కానీ ఇమ్రాన్ దంపతులు అత్యంత విలువ చేసే వస్తువులను మూడోవంతు కంటే తక్కువ డబ్బు కట్టి తీసుకున్నారని, ఆ తర్వాత వాటిని దుబాయ్​లో అమ్ముకున్నారని పాక్​ మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆరోపించారు. ఈ వివాదంపై ప్రధాన ఎన్నికల కమిషనర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ విచారణ జరిపింది. వస్తువుల కొనుగోలు వివరాలను ఐటీ​ రిటర్న్స్​లో చూపలేదని తెలిపింది. దీంతో ఆయనపై ఈసీ అనర్హత వేటు వేసింది. ఈ కేసులో ఇస్లామాబాద్​లోని జిల్లా, సెషన్స్ కోర్టు ఆగస్టు 5న ఇమ్రాన్​కు మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది. దానిని  ఇస్లామాబాద్ ​హైకోర్టు కొట్టివేసింది.

తోషఖానా కేసులోనే మళ్లీ తీర్పు 

సౌదీ యువరాజు నుంచి ఇమ్రాన్​ దంపతులు రూ.157 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు తీసుకున్నారని, అందుకు రూ.90 లక్షలు మాత్రమే చెల్లించారని పాక్ ​నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో(ఎన్​ఏబీ) గత నెలలో కేసు నమోదు చేసింది. ఈ కేసును బుధవారం మహమద్​ బషీర్ ​నేతృత్వంలోని విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ.. ఈ కేసులో మీ స్టేట్​మెంట్​ను రికార్డ్ చేశారా అని ప్రశ్నించగా, తన లాయర్లు వచ్చిన తర్వాత సమర్పిస్తానని ఇమ్రాన్ ​ఖాన్​ జవాబిచ్చారు. ఆపై కోర్టు తనను మోసం చేస్తున్నదని, తన వాదన వినిపించే అవకాశం ఇవ్వకుండా కేవలం హాజరు కోసం మాత్రమే తనను పిలుస్తున్నారని  ఇమ్రాన్​ ఖాన్​ ఆవేదన వ్యక్తం చేశారు.