వర్సిటీ స్టూడెంట్ ఎలక్షన్స్ : ఫస్ట్ టైం ABVP తరపున ముస్లిం యువతి పోటీ

వర్సిటీ స్టూడెంట్ ఎలక్షన్స్ : ఫస్ట్ టైం ABVP తరపున ముస్లిం యువతి పోటీ

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) చరిత్రలోనే ఓ ముస్లిం విద్యార్థిని ఈ సారి వర్సిటీ ఎన్నికల బరిలో నిలిచింది. నవంబర్ 9న జరగనున్న యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UOH) విద్యార్థి సంఘం ఎన్నికలకు మొదటిసారిగా ఏబీవీపీ.. షేక్ ఆయేషా అనే మహిళా అభ్యర్థిని బరిలోకి దింపింది. SFI-ASA-TSF కూటమికి చెందిన మహ్మద్ అతీక్ అహ్మద్‌కు ప్రత్యర్థిగా ఈమె పోటీ చేస్తున్నారు. యూనివర్సిటీ అధ్యక్ష పదవి కోసం ఇద్దరు మైనార్టీ అభ్యర్థులు పోటీ పడటం ఇదే తొలిసారి కావటం గమనార్హం.

విశాఖపట్నంకు చెందిన షేక్ అయేషా యూనివర్సిటీలో కెమిస్ట్రీ విభాగంలో పీహెచ్‌డీ చేస్తున్నారు. అహ్మద్ కూడా పీహెచ్‌డీ విద్యార్థే. అతడి స్వస్థలం హైదరాబాద్. 2019 నుంచి తాను ఏబీవీపీలో కొనసాగుతున్నట్లు ఆయేషా వెల్లడించారు. సంస్థ ఎప్పడూ ముస్లిం విద్యార్థులకు వ్యతిరేకం కాదని.. మైనార్టీలకు అనుకూలమైనది ఆమె ఈ సందర్భంగా అన్నారు. ఏబీవీపీ మైనార్టీలకు వ్యతిరేకం కాదనే సందేశాన్ని ఇవ్వటానికే తనను అభ్యర్థిగా బరిలోకి దింపారని ఆమె స్పష్టం చేశారు.

ఏబీవీపీ అనేది మైనారిటీలకు, భారతదేశానికి అనుకూలమైనదన్న ఆయేషా.. ఆ సంస్థ దేశానికి సపోర్ట్ చేసే మైనారిటీలందరికీ మద్దతు ఇస్తుందని చెప్పారు. తాను ఏపీలోని సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీలో ఎంఎస్సీ చేస్తున్నప్పటి నుంచి ఏబీవీపీలో పని చేస్తున్నానని తెలిపారు. అప్పుడు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా పని చేసినట్లు చెప్పారు. తనకు దక్కిన అవకాశం ముస్లిం మహిళలకు కూడా నాయకత్వం విషయంలో ఏబీవీపీ మద్దతు తెలుపుతుందని చెప్పటానికి ఉదాహరణగా నిలుస్తుందని అయేషా వెల్లడించారు.