సగం ఇల్లు మహారాష్ట్రలో.. మరో సగం తెలంగాణలో.. ఎక్కడంటే.. ?

సగం ఇల్లు మహారాష్ట్రలో.. మరో సగం తెలంగాణలో.. ఎక్కడంటే.. ?

ఒక్క ఇల్లు.. రెండు రాష్ట్రాల్లో.. అవును. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా అదే నిజం. చూడడానికి ఒక్క ఇల్లే. కానీ ఉన్నది మాత్రం రెండు రాష్ట్రాల్లో. మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు విషయంలో వారి మధ్య తీవ్ర వివాదం కొనసాగుతుండగా తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో విస్తరించి ఉన్న చంద్రాపూర్‌లోని మహారాజ్‌గూడ గ్రామంలో ఉన్న ఓ ఇల్లు అందర్నీ ఆకర్షిస్తోంది. ఆ ఇంటి విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులోని చంద్రాపూర్ జిల్లా మహారాజగూడ గ్రామంలో ఉన్న ఈ ఇల్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఈ ఇంట్లో మొత్తం 10 గదులు ఉండగా.. అందులో నాలుగు గదులు మహారాష్ట్ర కిందకి, మరో నాలుగు తెలంగాణ కిందకు వస్తాయి. అందుకే ఈ కుటుంబం రెండు రాష్ట్రాల్లోనూ ఇంటి పన్నుతో పాటు అన్ని రకాల పన్నులనూ చెల్లిస్తోంది. ఎక్కువ పన్ను కట్టాల్సి వస్తున్నా దానికి ఎలాంటి బాధ పడడం లేదని ఆ కుటుంబం స్పష్టం చేస్తోంది. అయితే ఈ ఇంట్లో మొత్తం 13మంది నివసిస్తుండగా.. వీరికి  రెండు రాష్ట్రాల ప్రభుత్వాల నుండి సంక్షేమ పథకాలను, ప్రయోజనాలను పొందుతున్నారు.

1969లో సరిహద్దు సర్వే చేసినప్పుడు తమ ఇంట్లో సగం మహారాష్ట్రలో ఉందని, మిగిలిన సగం తెలంగాణలో ఉందని ఆ కుటుంబ తెలిపింది. తాము ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోలేదని, రెండు రాష్ట్రాల గ్రామ పంచాయతీలకు పన్నులు చెల్లిస్తున్నామని, తెలంగాణ ప్రభుత్వ పథకాల కింద మరిన్ని ప్రయోజనాలను పొందుతున్నామని కూడా ఆ ఇంటి సభ్యుడు ఒకరు స్పష్టం చేశారు. ఈ వార్త వైరల్ కావడంతో దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతా మహారాజగూడ గ్రామానికి మాత్రమే తెలిసిన ఈ ఇల్లు ఇప్పుడు దేశంలోని చాలా మందికి పరిచయమైంది.