ఉద్యోగాల సృష్టే లక్ష్యం.. ఆత్మనిర్భర్ 3.0ను ప్రకటించిన కేంద్రం

ఉద్యోగాల సృష్టే లక్ష్యం.. ఆత్మనిర్భర్ 3.0ను ప్రకటించిన కేంద్రం

న్యూఢిల్లీ: కరోనాతో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేందుకు కేంద్ర సర్కార్ మరో ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. ఆత్మనిర్భర్ భారత్ 3.0లో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం 12 కీలక ప్రకటనలు చేశారు. ‘ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌‌గార్ యోజనను ప్రకటిస్తున్నాం. ఈ యోజన కింద ఉద్యోగులను తీసుకునే సంస్థలకు రెండేళ్ల వరకు పీఎఫ్ కాంట్రిబ్యూషన్‌‌లో సబ్సిడీ కల్పిస్తాం. కరోనా నుంచి కోలుకునే క్రమంలో కొత్తగా ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుంది. వెయ్యి లోపు ఉద్యోగులు ఉండే సంస్థలకు ఉద్యోగుల వాటా, కంపెనీల వాటా పీఎఫ్ మొత్తం 24 శాతం కేంద్రమే భరిస్తుంది. ఈపీహెచ్‌‌వో రిజిస్టర్డ్ కంపెనీల్లో రూ.15 వేలలోపు వేతనానికి జాయినయ్యే ఉద్యోగులకు ఇది వర్తించనుంది’ అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పీఎం గరీబ్ కల్యాణ్ రోజ్‌‌గార్ యోజనకు అదనంగా రూ.10 వేల కోట్లను కేంద్ర సర్కార్ కేటాయించింది. వ్యవసాయానికి మద్దతు కల్పించేందుకు ఎరువుల రాయితీ కోసం అదనంగా రూ.65 వేల కోట్లను కేటాయించింది. దీంతో దాదాపు కోటిన్నర మందికి లబ్ధి చేకూరనుంది.