- కెనడా పార్లమెంటును చుట్టుముట్టిన ట్రక్కులు
- వ్యాక్సిన్ వేయించుకోబోమంటూ డ్రైవర్ల ఆందోళన
- హారన్ మోతలతో మారుమోగిన ఓటవా సిటీ
- అల్లర్లకు భయపడి ఫ్యామిలీతో సహా దాక్కున్న పీఎం ట్రూడో
ఓటవా( కెనడా): కరోనా వ్యాక్సినేషన్‌ను తప్పనిసరి చేస్తూ కెనడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆ దేశంలో చిచ్చు పెట్టింది. శనివారం వందలాది మంది డ్రైవర్లు తమ ట్రక్కులతో ఏకంగా రాజధాని ఓటవా సిటీలోని పార్లమెంటు బిల్డింగునే చుట్టుముట్టారు. సిటీ అంతా ట్రక్కుల హారన్ల మోతలతో మారుమోగింది. ట్రక్కులపై కెనడా జెండాలను కట్టుకుని ‘ఫ్రీడమ్ కాన్వాయ్’ పేరుతో రాజధానిలోకి ఎంటరైన డ్రైవర్లు పార్లమెంటు హిల్ బిల్డింగ్ వద్దకు చేరుకున్నారు. ట్రక్కు డ్రైవర్లతో పాటు వేలాది మంది జనం కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డెక్కారు. ప్లేట్లు, గిన్నెలు వాయిస్తూ పార్లమెంటు బిల్డింగ్ వద్ద పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. దీంతో అల్లర్లు జరుగుతాయని భయపడిన ప్రధాని జస్టిన్ ట్రూడో తన ఫ్యామిలీతో సహా సిటీలోని సీక్రెట్ ప్లేస్ కు వెళ్లి దాక్కున్నారు. నిరసనకారులు వార్ మెమోరియల్‌పైనా, సైనికుల సమాధులపైనా ఎక్కి డ్యాన్స్‌లు చేశారు. మంచు ఎక్కువగా పడుతుందనీ, చలి పెరుగుతుందని హెచ్చరికలు ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో నిరసనకారులు పార్లమెంటు బిల్డింగ్ వద్దకు చేరుకున్నారు. దీంతో హింసాత్మక ఘటనలు జరిగే చాన్స్ ఉందని పోలీసులు అలర్ట్ అయ్యారు. నిరసనలను డిఫెన్స్ మినిస్టర్, కెనడా టాప్ సోల్జర్ జనరల్ వేన్ ఐర్ ఖండించారు. ‘‘అమరుల సమాధులపైనా, వార్ మెమోరియల్ పైన డ్యాన్స్‌లు చేయడం సిగ్గుచేటు. డ్యాన్స్ చేసినోళ్లు సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం’’ అని ట్వీట్ చేశారు.
