త్వరలో జిల్లాలకు ఇన్​చార్జ్​ మంత్రులు

త్వరలో జిల్లాలకు ఇన్​చార్జ్​ మంత్రులు

అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రకటించే అవకాశం

జిల్లాలకు మళ్లీ ఇన్​చార్జ్​ మంత్రులను నియమించనున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల తర్వాత వారి జాబితా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశముంది. ఇన్​చార్జ్‌ మంత్రుల ఆధ్వర్యంలోనే జిల్లా మినరల్ ఫండ్స్ ఖర్చు పెట్టనున్నారు. మైనింగ్ ప్రభావిత జిల్లాల్లో అభివృద్ధి కోసం  మైన్స్, మినరల్ డెవలప్​మెంట్​ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 2015 కింద కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక  నిధులు మంజూరు చేస్తుంటుంది. వీటిని జిల్లా మినరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఖర్చు చేస్తారు. గతంలో కలెక్టర్ నేతృత్వంలో గ్రామ సభ నిర్వహించి ఏ పనులకు నిధులివ్వాలో నిర్ణయించేవారు. కానీ, గతేడాది మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం ఫౌండేషన్ నిర్మాణాన్ని మార్చేసింది. నిధుల కేటాయింపు అధికారాలను ప్రజాప్రతినిధులకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. జిల్లా ఇన్​చార్జ్​ మంత్రి చైర్మన్ గా కలెక్టర్ మెంబర్ సెక్రటరీగా జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేస్తూ రూల్స్ మార్చింది. ఈ కమిటీ సూచనల మేరకు కేంద్రం నిధులు విడుదల చేయనుంది. కానీ ఈ లోపు అసెంబ్లీ రద్దవడం, తర్వాత వరుస ఎన్నికలతో ఇన్​చార్జ్​  మంత్రుల నియామకం కుదురలేదు.

ఒక్కొక్కరికి మూడు జిల్లాలు!

రాష్ట్రానికి జిల్లా మినరల్ ఫండ్స్ (డీఎంఎఫ్​) కింద రూ.1,800 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. ఈ నిధులు ఇన్​చార్జ్​ మంత్రులు లేక మురిగిపోతున్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రితో కలిసి 12 మంది మంత్రులున్నారు. ఇన్​చార్జ్​ మంత్రుల నియామకం జరిగేలోపు మంత్రి వర్గ విస్తరణ లేకపోతే 11 మంది మంత్రులకు ఒక్కొక్కరికి 3 జిల్లాల బాధ్యతలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లా ఇన్​చార్జ్​ మంత్రులు ఉండేవారు. తెలంగాణ వచ్చాక ఇన్​చార్జ్​ మంత్రుల వ్యవస్థను కేసీఆర్ రద్దు చేశారు. కానీ డీఎంఎఫ్ నిధుల కోసం నిబంధనలు మార్చడంతో తిరిగి ఇన్​చార్జ్​ మంత్రులను ఏర్పాటు చేయనున్నారు.

మరిన్ని బాధ్యతలు?

ఇన్​చార్జ్​ మంత్రులను నియమిస్తే వారికి రాజకీయ ప్రాధాన్యం పెరగనుంది. జిల్లాల్లో వందలాది నామినేటెడ్ పోస్టులున్నాయి. వారి నియామకంలో జిల్లా ఇన్​చార్జ్​ మంత్రి కీలకంగా మారొచ్చని టీఆర్​ఎస్​ వర్గాలంటున్నాయి. జిల్లా స్థాయిలో నేతల సమన్వయం,  సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించే బాధ్యతలను కూడా వారికి  అప్పగించే అవకాశం ఉంది.