1,500 ఎకరాల్లో హెచ్​ఎండీఏ ల్యాండ్ పూలింగ్!

1,500 ఎకరాల్లో హెచ్​ఎండీఏ ల్యాండ్ పూలింగ్!
  • రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో రైతుల భూముల పరిశీలన
  • లేమూరులో తొలి దశలో 150 ఎకరాల్లో వెంచర్ వేసే ప్లాన్

హైదరాబాద్, వెలుగు: ఏండ్లుగా ఊరిస్తున్న హెచ్ఎండీఏ ల్యాండ్ పూలింగ్ స్పీడ్ అందుకుంటోంది. భారీగా ప్రైవేటు భూములను సమీకరించి, లేఅవుట్లు వేసి అమ్మేందుకు చేస్తున్న పనులు ఇటీవల వేగం పుంజుకున్నాయి. మేడ్చల్ జిల్లాలో భూములు ఇచ్చేందుకు ఆసక్తి చూపిన రైతుల భూమి పట్టా, పాస్ బుక్కులను ఇటీవల రెవెన్యూ అధికారులు పరిశీలించినట్లు తెలిసింది. కొన్నేండ్ల కిందనే సర్కార్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలని నిర్ణయించినప్పటికీ.. అది ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల జిల్లాల వారీగా చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో హెచ్ఎండీఏకు భూములు ఇచ్చేందుకు చాలా మంది రైతులు ఆసక్తి చూపినట్లు సమాచారం. దీంతో ముందుగా మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలలో దశల వారీగా భూములను సమీకరించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

రెండు జిల్లాల్లో..

రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఏకంగా 1500 ఎకరాల భూమి సమీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డెవలప్ చేసిన భూమి విషయంలో యజమానులకు 60–40 శాతం వాటాగా ఇచ్చేలా హెచ్ఎండీఏ రూల్స్ మార్చింది. దీంతో భూ యజమానుల నుంచి సానుకూల స్పందన వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మేడ్చల్ జిల్లాలోని బోగారం, శామీర్ పేట్ వంటి ప్రాంతాల్లో ఓఆర్ఆర్ కు దగ్గరగా ఉండే భూములను సమీకరించనున్నారు. భోగారంలో ల్యాండ్​పూలింగ్ పై ప్రజాభిప్రాయ సేకరణ కూడా పూర్తయింది.

శివార్లలో మినీ శాటిలైట్ సిటీల అభివృద్ధి

సిటీలో పెరిగిపోతున్న జనాభా, ట్రాఫిక్, కాలుష్యం వల్ల ఓఆర్ఆర్ అవతల సిటీ శరవేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో శివార్లల్లో మినీ శాటిలైట్ సిటీలను అభివృద్ధి చేయాలని హెచ్ఎండీఏ ప్లాన్​చేస్తోంది ఇందుకోసం దాదాపు 5వేల నుంచి 7 వేల ఎకరాలు సమీకరించి, అభివృద్ధి చేయనున్నట్లు తెలుస్తోంది.

పైలెట్ ప్రాజెక్టుగా లేమూరు వెంచర్...

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని లేమూర్ రెవెన్యూ విలేజ్‌‌‌‌లో హెచ్ఎండీఏ పైలట్ ప్రాజెక్ట్ చేపట్టనుంది. 150 ఎకరాల పరిధిలో రానున్న ఈ వెంచర్‌‌‌‌‌‌‌‌ను.. ఆధునిక సౌలతులతో అభివృద్ధి చేయనున్నారు. వీటిలో 650 గజాల నుంచి 3 ఎకరాల విస్తీర్ణంలో ఒక్కో ప్లాటు నిర్మించేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే నోటిఫికేషన్ విడుదల తర్వాత ప్లాట్ల సంఖ్యపై క్లారిటీ రానుంది.  ఫార్మా సిటీ, కొంగర కలాన్ కలెక్టరేట్, ఏరో స్పేస్ పార్క్ వంటి ప్రాజెక్టులతో రియల్ వ్యాపారానికి కేంద్రంగా రంగారెడ్డి జిల్లా మారింది. ఈ దశలో భారీగా ఓపెన్ ల్యాండ్ బ్యాంక్‌‌‌‌కు అవకాశం ఉన్న రంగారెడ్డి జిల్లా నుంచి పైలట్ ప్రాజెక్ట్ చేపట్టడానికి హెచ్ఎండీఏ అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే భూ యజమానుల నుంచి భూములు సమీకరించేందుకు అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ, భూముల టైటిల్ వెరిఫికేషన్ పూర్తి చేసినట్లుగా సమాచారం. నోటిఫికేషన్ విడుదల చేసిన నాలుగు, ఐదు నెలల్లో నిర్మాణ పనులు మొదలుపెట్టనున్నారు.