తెలంగాణ భవన్‌లో .. పట్నం వర్సెస్ పైలెట్

తెలంగాణ భవన్‌లో .. పట్నం వర్సెస్ పైలెట్
  • చేవెళ్ల లోక్‌సభ సెగ్మెంట్​ సమీక్షలో ఇరువర్గాల మధ్య లొల్లి
  • పట్నం మహేందర్​రెడ్డి వల్లే ఓడానంటూ పైలెట్ రోహిత్​ రెడ్డి ఫైర్
  • కుర్చీలు విసురుకున్న రెండు వర్గాల నేతలు.. సర్దిచెప్పిన హరీశ్​

హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్ నేతలు పట్నం మహేందర్​రెడ్డి, పైలెట్ రోహిత్​రెడ్డి వర్గాల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. తెలంగాణ భవన్ వేదికగా, సీనియర్ నేతల సమక్షంలోనే ఇద్దరు నేతలు ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లారు. అప్పుడు నేతలు అడ్డుకున్నా.. తర్వాత రెండు వర్గాల నాయకులు, కార్యకర్తలు కుర్చీలు విసురుకున్నారు. దీంతో శుక్రవారం మాజీ మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన చేవెళ్ల లోక్‌సభ ఎన్నికల సన్నద్ధత సమావేశం రసాభాసగా సాగింది. అయితే  తమ మధ్య జరిగింది చిన్నపాటి వాగ్వాదమేనని, ఇల్లన్నప్పుడు ఏవో చిన్న సమస్యలు సహజమని మహేందర్​రెడ్డి చెప్పడం గమనార్హం.

చేవెళ్ల లోక్‌సభ సమీక్షలో తాండూరు నియోజకవర్గం అంశం ప్రస్తావనకు రాగా.. తనను ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డే ఓడించారని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్​రెడ్డి ఆరోపించారు.ఎమ్మెల్సీపైకి దూసుకుపోయేందుకు యత్నించగా.. అక్కడే ఉన్న నేతలు అడ్డుకున్నారు. ఈ సమయంలో కొద్దిసేపు పట్నం, పైలెట్ పరస్పరం తిట్టుకున్నారు. ఆగ్రహంతో ఊగిపోయిన పైలెట్​తన కుర్చీని పట్నంపైకి విసిరేయడానికి ప్రయత్నించగా నేతలు అడ్డుకున్నారు. బీఆర్ఎస్​ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూనే తన అనుచరుడికి కాంగ్రెస్​టికెట్ ఇప్పించి సొంత పార్టీ ఓటమికి కారకుడయ్యారని మహేందర్‌‌రెడ్డిపై రోహిత్ రెడ్డి ఆరోపణలు చేశారు. తాను పార్టీ గెలుపు కోసం శక్తివంచన లేకుండా పని చేశానని, ఎమ్మెల్యే తీరుతోనే ఓటమి ఎదురైందని మహేందర్​రెడ్డి చెప్పారు. ఈ క్రమంలోనే తాండూరు నియోజకవర్గానికి చెందిన పట్నం, పైలెట్ వర్గీయులు పరస్పరం కుర్చీలు విసురుకున్నారు. దీంతో గందరగోళ వాతావరణం ఏర్పడింది. మాజీ మంత్రి హరీశ్​రావుతో పాటు వేదికపై ఉన్న సీనియర్​నేతలు జోక్యం చేసుకొని సర్దిచెప్పారు.

అప్పటి నుంచి ఉప్పు నిప్పు

2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన పట్నం మహేందర్​రెడ్డిపై కాంగ్రెస్​ నుంచి పోటీ చేసిన పైలెట్ రోహిత్​రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత పైలెట్ బీఆర్ఎస్‌లో చేరారు. రంగారెడ్డి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా మహేందర్​రెడ్డి ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఇద్దరు నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.  ఈ క్రమంలో జరిగిన చేవెళ్ల లోక్​సభ సమీక్షలో రెండు వర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. పార్టీకి ద్రోహం చేసి అభ్యర్థుల ఓటమికి కారణమైన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా.. వారితోనే పార్లమెంట్​ఎన్నికలు సమీక్షలు చేయడం సరికాదని ఓ సీనియర్​నేత వ్యాఖ్యానించినట్టు తెలిసింది.

చిన్నపాటి వాగ్వాదమే: పట్నం

తెలంగాణ భవన్‌లో జరిగింది చిన్నపాటి వాగ్వాదమేనని మాజీ మంత్రి పట్నం మహేందర్​రెడ్డి అన్నారు. ఇల్లన్నప్పుడు చిన్న సమస్యలు సహజమని, అందులో భాగంగానే రోహిత్​రెడ్డితో వాగ్వాదం జరిగిందన్నారు. అందరం కలిసికట్టుగా చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్​రెడ్డి గెలుపు కోసం పని చేస్తామని చెప్పారు. చేవెళ్ల నుంచి రంజిత్​రెడ్డి మరోసారి లోక్‌సభకు పోటీ చేయాలని సమావేశంలో తీర్మానించామన్నారు. 6 గంటలు సమావేశం జరిగితే.. 5 నిమిషాలు డిస్టర్బెన్స్ జరిగిందని, పార్టీలో ప్రజాస్వామ్యం ఉందని, భేదాభిప్రాయాలు సహజమేనని ఎమ్మెల్సీ మధుసూదనాచారి తెలిపారు.

ఇద్దరితో హరీశ్ భేటీ

తెలంగాణ భవన్​లో ఎమ్మెల్సీ పట్నం మహేందర్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలెట్​రోహిత్​రెడ్డితో మాజీ మంత్రి హరీశ్​ భేటీ అయ్యారు. నేతల సమక్షంలో గొడవ పడితే, పరస్పరం తిట్టుకుంటే చులకన అవుతామని, ఇలాంటి పద్ధతులు పార్టీకి కూడా మంచి చేయవని సూచించారు. ఎన్నికల్లో పొరపాట్లు జరిగితే పార్టీ దృష్టికి తీసుకురావాలే తప్ప ఇలా బాహాటంగా వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని అన్నారు.