ఫిషరీస్‌‌‌‌ మెంబర్‌‌‌‌షిప్‌‌‌‌ విషయంలో..గంగపుత్రులు, ముదిరాజ్‌‌‌‌ల మధ్య గొడవ

ఫిషరీస్‌‌‌‌ మెంబర్‌‌‌‌షిప్‌‌‌‌ విషయంలో..గంగపుత్రులు, ముదిరాజ్‌‌‌‌ల మధ్య గొడవ
  •     పోలీసులు, ఆఫీసర్ల సమక్షంలో చేపలు పట్టిన గంగపుత్రులు
  •     చెరువులోకి దిగి అడ్డుకున్న ముదిరాజ్‌‌‌‌ యువకులు
  •     నీటిలో మునిగి రాజు అనే యువకుడు మృతి
  •     పోలీసులపై తిరగబడ్డ గ్రామస్తులు, ఇద్దరికి గాయాలు

మెదక్, వెలుగు : మెదక్‌‌‌‌ జిల్లా హావేలీ ఘన్‌‌‌‌పూర్‌‌‌‌ మండలం బూర్గుపల్లి చెరువులో చేపలు పట్టే విషయంపై గంగపుత్రులు, ముదిరాజ్‌‌‌‌ల మధ్య నెలకొన్న వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. గంగపుత్రులు చేపలు పడుతుండగా, వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించి ముదిరాజ్‌‌‌‌ వర్గానికి చెందిన ఓ యువకుడు చనిపోయాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు పోలీసులపై దాడికి దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గ్రామంలో శ్రీపతి చెరువు, పెద్ద చెరువు ఉండగా ఫిషరీస్‌‌‌‌ సొసైటీలో మెంబర్‌‌‌‌షిప్‌‌‌‌ విషయంలో గ్రామానికి చెందిన గంగ పుత్రులు, ముదిరాజ్‌‌‌‌ల మధ్య కొన్ని రోజుల నుంచి వివాదం నెలకొంది.

చెరువులో చేపలు పట్టుకునే హక్కు కోసం గంగపుత్రులు కోర్టుకు వెళ్లగా వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఫిషరీస్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆఫీసర్లు, పోలీస్‌‌‌‌ బందోబస్త్‌‌‌‌ మధ్య గంగపుత్రులు శుక్రవారం చేపలు పట్టేందుకు పెద్ద చెరువులోకి దిగారు. విషయం తెలుసుకున్న ముదిరాజ్‌‌‌‌ వర్గానికి చెందిన నలుగురు యువకులు పోలీసుల కళ్లుగప్పి చెరువులో దిగారు. చేపలు పడుతున్న గంగపుత్రులను అడ్డుకొని వారిని చెరువులో నుంచి బయటకు పంపే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో ముదిరాజ్‌‌‌‌ వర్గానికి చెందిన రాజు (29) అనే యువకుడు నీటిలో మునిగి చనిపోయాడు. విషయం తెలిసుకున్న గ్రామస్తులు పెద్దసంఖ్యలో చెరువు వద్దకు వచ్చి ఆఫీసర్లతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఎంత నచ్చజెప్పినా వినిపించుకోలేదు. ఈ క్రమంలో ఆగ్రహించిన గ్రామస్తులు పోలీసులపైకి కర్రలు విసరడంతో ఓ పోలీస్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌కు, కానిస్టేబుల్‌‌‌‌కు గాయాలు అయ్యాయి. తర్వాత చెరువు కట్టమీద ఉన్న బైక్‌‌‌‌లు, టాటా ఏస్‌‌‌‌ వెహికల్‌‌‌‌కు నిప్పు పెట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

మెదక్, తూప్రాన్‌‌‌‌ డీఎస్పీలు రాజేశ్, వెంకట్‌‌‌‌రెడ్డి బూర్గుపల్లి చేరుకుని, మెదక్‌‌‌‌ నుంచి అదనపు బలగాలను రప్పించారు. ఘటన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు గ్రామానికి చేరుకున్నారు. మృతి చెందిన రాజు ఫ్యామిలీకి రూ. 4 లక్షల సాయం అందిస్తామన్నారు. చెరువు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.