చట్టసభల్లో 50% బీసీ రిజర్వేషన్లు కల్పించాల్సిందే

చట్టసభల్లో 50% బీసీ రిజర్వేషన్లు కల్పించాల్సిందే

హైదరాబాద్: చట్టసభల్లో 50శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య వెల్లడించారు. వచ్చే పార్లమెంట్ సమావేశాలలో బీసీ బిల్లు పెట్టి ఆమోదించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. పార్లమెంటులో బీసీల న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు పోరాడతానని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం కాచిగూడలో నిర్వహించిన  బీసీల సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల కంటే తెలుగు రాష్ట్రాలలో ఉద్యమాల ఫలితంగా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఉచిత విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. దేశంలో 70 కోట్ల బీసీలకు అన్యాయం జరుగుతోందని, చట్టసభలలో తమ వాటా దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ సంస్థలో బీసీ రిజర్వేషన్లు 34 నుండి 50 శాతం పెంచాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్య, ఉద్యోగ రిజర్వేషన్లపై క్రిమిలేయర్ ఎత్తివేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.