
న్యూఢిల్లీ: రైల్వే శాఖలో ఉద్యోగాల పేరిట ఓ ముఠా తమిళనాడుకు చెందిన 28 మంది యువకులను పిచ్చోళ్లను చేసింది. టీటీఈ, ట్రాఫిక్అసిస్టెంట్స్, క్లర్క్ ట్రైనింగ్‌లో భాగంగా ఢిల్లీ రైల్వే స్టేషన్లో కూర్చోబెట్టి రోజూ ఎన్ని రైళ్లు వచ్చి వెళ్తున్నాయి? వాటికి ఎన్ని డబ్బాలు ఉన్నాయి? లెక్కపెట్టించింది. ఇదంతా ఫేక్ అని తెలియని వారంతా.. డెయిలీ 8 గంటల పాటు వేర్వేరు ప్లాట్ ఫాంపై కూర్చొని వచ్చీ.. పోయే రైళ్లతో పాటు వాటి బోగీలను లెక్కపెట్టడం స్టార్ట్ చేశారు. జాబ్స్ కోసం యువకుల నుంచి మొత్తం రూ.2.67 కోట్లు వసూలు చేసింది. ఒక్కొక్కరు రూ.2లక్షల నుంచి రూ.24 లక్షల దాకా సమర్పించుకున్నారు. నెల రోజుల ట్రైనింగ్ పూర్తి చేసుకుంటే.. రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్ గ్యారంటీ అని నమ్మించారు. ట్రైనింగ్ తర్వాత ఇచ్చిన అపాయింట్మెంట్ లెటర్లు ఫేక్ అని తేలడంతో.. చివరికి మోసపోయామని తెలుసుకున్న బాధితులు.. పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో ఈ ఫేక్ జాబ్స్ దందా బయటపడింది.
ముఠాగా ఏర్పడి మోసం
తమిళనాడుకు చెందిన 78 ఏండ్ల సుబ్బుసామి.. ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యాడు. కొన్ని నెలల కింద అతనికి ఢిల్లీలోని ఎంపీ క్వార్టర్స్‌లో కోయంబత్తూరుకు చెందిన శివరామన్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తనకు ఎంపీలు, మంత్రులు బాగా తెలుసని, రైల్వేల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ శివరామన్ నమ్మించాడు. దీంతో సుబ్బుసామి, తనకు తెలిసిన ముగ్గురిని ఢిల్లీకి తీసుకొచ్చాడు. ఈ విషయం మధురైలోని చాలా మందికి తెలియడంతో అందరూ జాబ్స్ కోసం ఎగబడ్డారు. మొత్తం 28 మంది శివరామన్‌ను కలవగా.. వారిని అతను ఢిల్లీకి తీసుకొచ్చాడు. అందరినీ వికాస్ రాణా అనే వ్యక్తితో శివరామన్ పరిచయం చేయించాడు. నార్తర్న్ రైల్వే ఆఫీస్‌లో రాణా, డిప్యూటీ డైరెక్టర్ అని చెప్పాడు. వేర్వేరు కేటగిరిలో ఉద్యోగాలున్నాయని 28 మందిని రాణా నమ్మించాడని, ఒక్కొక్కరమూ రూ.2లక్షల నుంచి రూ.24 లక్షల దాకా ఇచ్చుకున్నామని మధురైకు చెందిన బాధితుడు సెంథిల్ కుమార్ చెప్పాడు. ఫేక్ ట్రైనింగ్ లెటర్స్, ఐడీ కార్డులు ఇచ్చాడని, జూన్ నుంచి జులై మధ్యలో ఢిల్లీలోని రైల్వే స్టేషన్లో వచ్చీ పోయే ట్రైన్లు.. డబ్బాలు లెక్కించామని తెలిపాడు. ట్రైనింగ్ తర్వాత అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకొని జాయినింగ్ కోసం వెళ్లగా అవి ఫేక్ అని తేలినట్టు చెప్పాడు.