కాళ్లకుంట కాలనీలో బస్తీ దవాఖాన ప్రారంభం

కాళ్లకుంట కాలనీలో బస్తీ దవాఖాన ప్రారంభం

సిద్దిపేట : పేదల ఆరోగ్యం కోసమే  ప్రభుత్వం బస్తీ దవాఖానాలను  ఏర్పాటు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని హెల్త్​ మినిస్టర్​ హరీశ్ రావు అన్నారు. సోమవారం సిద్దిపేట పట్టణంలోని కాళ్లకుంట కాలనీలో బస్తీ దవాఖానను ప్రారంభించి మాట్లాడారు. సిద్ధిపేటలో వెయ్యి  పడకల ఆసుపత్రి త్వరలోనే అందుబాటులో రానుందని,  గుండె, క్యాన్సర్, కిడ్నీలాంటి వ్యాధులకు ఉచితంగా వైద్యం అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని  ప్రతి మనిషికి పది  కిలోల బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని అన్నారు. సంక్రాంతి తర్వాత సొంత జాగలో ఇల్లు కట్టుకునేవారికి  రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. 

స్వర్ణ కిరీటం సమర్పణ

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని సిద్దిపేటలోని మోహిన్ పురా శ్రీ వెంకటేశ్వరస్వామి, లాల్ కమాన్ వద్ద గల పాత వేంకటేశ్వరాలయాల్లో  మంత్రి హరీశ్​ రావు  ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్త వేంకటేశ్వర స్వామి ఆలయంలో  స్వామి వారికి రూ.కోటితో తయారు చేయించిన స్వర్ణ కిటాన్ని మంత్రి హరీశ్ రావు పూజారులకు  అందజేశారు. అనంతరం శృంగేరి శంకరమఠం  రజతోత్సవంలో పాల్గొన్నారు.