హుస్నాబాద్, వెలుగు: ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులకు సమానమని ఏసీపీ సదానందం అన్నారు. పట్టణ కేంద్రంలోని మున్సిపల్ ఆఫీసులో హుస్నాబాద్ మండల గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్స్ తో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఎంట్రన్స్, ఎగ్జిట్ పాయింట్ల దగ్గర కెమెరాలు ఉంటే నేరస్తులను పట్టుకోవడం ఈజీ అవుతుందన్నారు. గ్రామాల్లో శివాజీ విగ్రహం గానీ మరే ఇతర విగ్రహాలు గానీ పెట్టాలంటే కచ్చితంగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్నారు.
సర్పంచులు కులం, మతం చూడకుండా కేవలం న్యాయం వైపే నిలబడాలని, అప్పుడే గౌరవం పెరుగుతుందని హితవు పలికారు. భూ తగాదాలకు సర్పంచులు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐ లక్ష్మారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
