గచ్చిబౌలి, వెలుగు : కాలేజీ నుంచి ఇంటికి ఎందుకు లేట్‌గా వచ్చావని తల్లి మందలించడంతో ఇంటర్ ఫస్టియర్ స్టూడెంట్ ఉరేసుకుని సూసైడ్ చేసుకున్న ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రాజుపేట గ్రామానికి చెందిన బానోతు కుమారి కుటుంబంతో కలిసి హైదరాబాద్ వచ్చి గచ్చిబౌలి పీజేఆర్ నగర్‌లో నివాసముంటూ కూరగాయల బిజినెస్ చేస్తుంది.
కుమారి పెద్ద కుమారుడు కార్తీక్ స్థానికంగా ఉన్న కాలేజీలో డిగ్రీ సెకండియర్, రెండో కుమారుడు జశ్వంత్(17) మధురానగర్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్చదువుతున్నారు. జశ్వంత్ రోజూ కాలేజీకి వెళ్లి తిరిగి సాయంత్రం 4.30 గంటలకు ఇంటికి వచ్చేవాడు. ఈ నెల 20న సాయంత్రం 6.30 గంటలకు ఇంటికి వచ్చాడు. దీంతో కాలేజీ నుంచి ఇంటికి రావడానికి ఎందుకు లేట్ అయిందని జశ్వంత్ తల్లి మందలించింది.
బుధవారం ఉదయం 4.30 గంటలకు కుమారి తన పెద్ద కొడుకు కార్తీక్‌తో కలిసి కూరగాయలు తీసుకురావడానికి గుడిమల్కాపూర్ మార్కెట్‌కు వెళ్లి తిరిగి 7.15 గంటలకు ఇంటికి వచ్చారు. ఇంటి తలుపులు లోపలి నుంచి లాక్ చేసి ఉండడం.. జశ్వంత్‌ను పిలిచినా రెస్పాన్స్ లేకపోవడంతో కిటికిలోంచి లోపలికి చూడగా బెడ్రూంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించాడు. తలుపులు పగులగొట్టి బయటకు తీయగా అప్పటికే చనిపోయాడు. రాయదుర్గం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
