
రాష్ట్రంలో అమ్మాయిలు, చిన్నారులపై అత్యాచారాల ఉదంతాలు ఆగట్లేదు. నిత్యం ఏదో చోట ఆడపిల్ల మృగాళ్ల చేతిలో బలికావాల్సి వస్తోంది. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్‌లోని కొంపల్లిలో ఓ కుటుంబం వలస వచ్చింది. వారికి ఏడేళ్ల పాప ఉంది. ఆగస్టు 10న రోజూలాగే తల్లిదండ్రులు పాపని చూసుకోమని పొరుగింటి వారికి చెప్పి వదిలి పనికి వెళ్లారు. వారు సాయంత్రం వచ్చి చూసేసరికి పాప రక్తం మడుగులో కడుపు నొప్పి అంటూ విలవిల్లాడుతూ ఉంది. ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తనపై అత్యాచారం జరిగిందని పాప చెప్పింది. వారి ఇంటి పక్కనే ఉంటున్న తండ్రి శివకుమార్(45), కుమారుడు ఫైజల్(18) ఈ దారుణానికి ఒడిగట్టారని పాప పేరెంట్స్ కి చెప్పింది. మెరుగైన చికిత్స కోసం ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన..
తమ పాపపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. ఇలాంటి దారణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.