డబ్బుల కోసం యువకుడి హత్య.. మృతుడి ఫోన్​ అమ్మబోయి చిక్కిన వ్యక్తి

డబ్బుల కోసం యువకుడి హత్య.. మృతుడి ఫోన్​ అమ్మబోయి చిక్కిన వ్యక్తి
  • పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు
  • సిద్దిపేట జిల్లా జగదేవపూర్ లో ఘటన
  • మృతుడు పీర్లపల్లి యువకుడు

జగదేవపూర్, వెలుగు: సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలో డబ్బుల కోసం ఓ యువకుడిని హత్య చేసి చెరువులో పడేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం..మండలంలోని పీర్లపల్లికి చెందిన ఎర్ర కర్ణాకర్(28) ఈనెల 18న ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు ఎంత వెతికినా ఆచూకీ దొరక్కపోవడంతో ఈనెల 20న జగదేవపూర్ పీఎస్​లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా జగదేవపూర్​లో ఓ వైన్స్​వద్ద స్వామి అనే యువకుడు ఓ మొబైల్​ఫోన్​ను అమ్మడానికి ప్రయత్నించగా షాప్​ నిర్వాహకులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు స్వామిని అదుపులో తీసుకొని విచారించగా కర్ణాకర్ హత్యకు గురైన విషయం బయటపడింది. కర్ణాకర్ ఈనెల 18న ఇంటి నుంచి జగదేవపూర్​లోని వైన్స్​కు వెళ్లి మద్యం తాగాడు. తర్వాత షాప్ కు ఎదురుగా చెరువు పక్కన ఉన్న చింతచెట్టు కింద పడుకున్నాడు. అతడి దగ్గర డబ్బులున్న విషయాన్ని గమనించిన జగదేవపూర్​కు చెందిన రాగుల గణేశ్, కొంపల్లి నాగరాజు దగ్గరకు వచ్చారు. అతడికి మళ్లీ మద్యం తాగించి గొంతు నులిమి చంపారు. అతడి జేబులోని రూ.30వేల నగదు, మొబైల్ తీసుకొని డెడ్​బాడీని చెరువులో పడేసి వెళ్లిపోయారు. స్వామికి ఫోన్​ ఇచ్చి అమ్మాలని చెప్పారు. దీంతో అతడు అదే వైన్స్​కు వెళ్లి ఫోన్​ అమ్మబోయి అడ్డంగా దొరికాడు.  విచారణలో స్వామి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు మిగతా ఇద్దరు నిందితులను అదుపులో తీసుకున్నారు. ఆదివారం ఉదయం కర్ణాకర్ డెడ్​బాడీని జగదేవపూర్ చెరువు నుంచి తీసి పోస్టుమార్టం కోసం గజ్వేల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కర్ణాకర్ మృతికి కారణమైన వ్యక్తులను శిక్షించాలని జగదేవపూర్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. ఏసీపీ రమేశ్ నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతుడికి భార్య లావణ్య, నాలుగేళ్ల లోపు ఇద్దరు పిల్లలున్నారు.  

పాత కక్షలతో యువకుడి మర్డర్​

రాయికోడ్:  సంగారెడ్డి జిల్లా రాయికోడ్​ మండ లం సింగితం గ్రామంలో పాత కక్షలతో ఓ యువకుడిని చంపారు. ఎస్ఐ వెంకట్​రెడ్డి కథనం ప్రకారం.. సింగితం గ్రామానికి చెందిన  కర్చల్​రవి (25) అదే గ్రామానికి చెందిన ఒలిగె రాజు మధ్య కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. శనివారం రాత్రి ఎస్సీ వాడలోని ముక్కని నరేశ్​కు చెందిన ఆటోలో రవి కూర్చొని ఉండగా.. ఒలిగె రాజు కత్తితో వచ్చి రవి మెడ, ముఖం, తలపై  పొడిచాడు. ఈ దాడిలో రవి తీవ్రంగా గాయపడడంతో జహీరాబాద్ ​దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్​లోని గాంధీ హాస్పిటల్​కు తీసుకువెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు.