- సెన్సస్-2027లో ఓబీసీ కాలమ్ చేర్చాలని డిమాండ్
- కులాల వారీగా జనాభా వివరాలను నమోదు చేయాలని విజ్ఞప్తి
- పెద్ద సంఖ్యలో పాల్గొనాలని బీసీ సంఘాలకు పిలుపు
హైదరాబాద్, వెలుగు: సెన్సస్-–2027లో ఓబీసీల జనాభా వివరాలను ప్రత్యేకంగా నమోదు చేసేందుకు ఓబీసీ కాలమ్ చేర్చాలని బీసీ మేధావుల ఫోరం కన్వీనర్ చిరంజీవులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా శనివారం హైదరాబాద్ గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్, ఆల్ ఇండియా ఓబీసీ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ ఫోరం ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టనున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో చిరంజీవులు వెల్లడించారు.
దేశ జనాభాలో ఓబీసీల సంఖ్య, వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులు, విద్య, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యంపై సమగ్ర విధానాలు రూపొందించాలంటే కులాల వారీగా జనాభా గణన అవసరమని ఆయన పేర్కొన్నారు. సెన్సస్‌లో ప్రతి కులానికి సంబంధించిన జనాభా వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని కోరారు. భవిష్యత్‌లో సంక్షేమ, అభివృద్ధి, రాజకీయ ప్రాతినిధ్య విధానాల రూపకల్పనకు ఉపయోగపడేలా ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలని చిరంజీవులు డిమాండ్ చేశారు. ధర్నాకు బీసీ ప్రజలు, ప్రజాప్రతినిధులు, మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు, బీసీ సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్, ఆల్ ఇండియా ఓబీసీ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ ఫోరం ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నట్లు తెలిపారు.
