రూ. 50 లక్షల ఆదాయం ఉంటే.. ఇన్ కం ట్యాక్స్ స్పెషల్ నోటీసులు అంట..!

రూ. 50 లక్షల ఆదాయం ఉంటే.. ఇన్ కం ట్యాక్స్ స్పెషల్ నోటీసులు అంట..!

ఆదాయపు పన్ను శాఖ ఇటీవలి కాలంలో పన్ను చెల్లింపుదారులకు పంపిస్తున్న 'నడ్జ్' నోటీసులు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. చాలా మంది ఈ నోటీసులను చూసి భయపడుతున్నారు. కానీ.. నిజానికి ఇది శిక్షించడానికి ఇచ్చే నోటీసు కాదు, మిమ్మల్ని అప్రమత్తం చేయడానికి ఇచ్చే ఒక చిన్న హెచ్చరిక మాత్రమే. ఐటీ రిటర్న్స్‌లో దొర్లే పొరపాట్లను మీ అంతట మీరే సరిదిద్దుకునేలా ప్రోత్సహించడమే ఈ కొత్త విధానం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.

అసలేమిటి 'నడ్జ్' నోటీసు..?
NUDGE అంటే 'Non-intrusive Usage of Data to Guide and Enable'. అంటే మీ రోజువారీ పనులకు ఆటంకం కలగకుండా.. అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించడం అని అర్థం. గతంలో లాగా ఐటీ అధికారులు నేరుగా దాడులు చేయడం లేదా పెనాల్టీలు వేయడం కాకుండా, ముందుగా ఒక అడ్వైజరీ మెసేజ్‌ను పంపిస్తారు. మీ రిటర్న్స్‌లో చూపించిన వివరాలకు, ఐటీ శాఖ దగ్గర ఉన్న డేటాకు మధ్య తేడాలు ఉంటే ఈ మెసేజ్ వస్తుంది.

వాళ్లకు డేటా ఎక్కడి నుంచి వస్తుంది..?
ప్రస్తుతం ఐటీ శాఖ అత్యాధునిక రిస్క్ అనలిటిక్స్, థర్డ్ పార్టీ డేటాను ఉపయోగిస్తోంది. మీ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ , బ్యాంక్ రికార్డులు, షేర్ మార్కెట్ పెట్టుబడులు,  ఖరీదైన కొనుగోళ్లకు సంబంధించిన సమాచారాన్ని ఐటీఆర్ వివరాలతో సిస్టమ్ సరిపోల్చి చూస్తుంది. ఎక్కడైనా పొంతన లేకపోతే వెంటనే సాఫ్ట్‌వేర్ అలర్ట్ ఇస్తుంది. ప్రధానంగా ఏడాదికి రూ.50 లక్షల కంటే ఎక్కువ సంపాదన ఉన్నవారు, కంపెనీల్లో కీలక పదవుల్లో ఉన్నవారు, విదేశీ ఆస్తులున్న వారు ఈ నోటీసుల పరిధిలోకి వస్తున్నారు.

నోటీసు వస్తే ఏం చేయాలి..?
నడ్జ్ నోటీసు రాగానే కంగారు పడాల్సిన అవసరం లేదు. మొదట మీ ఐటీఆర్ వివరాలను AIS స్టేట్‌మెంట్‌తో ఒకటికి రెండుసార్లు చెక్ చేయండి. ఎక్కడైనా పొరపాటున ఆదాయాన్ని తక్కువగా చూపినా లేదా తప్పుడు డిడక్షన్స్ క్లెయిమ్ చేసినా.. వెంటనే రివైజ్డ్ లేదా అప్‌డేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేయండి. ఒకవేళ మీరు అదనంగా పన్ను కట్టాల్సి వస్తే ముందే కట్టేయడం మంచిది. దీనివల్ల భవిష్యత్తులో వచ్చే భారీ పెనాల్టీలు, విచారణల నుంచి తప్పించుకోవచ్చు.

నిర్లక్ష్యం వద్దు..
చాలా మంది ఈ నోటీసులను సాధారణ మెసేజ్‌లలా భావించి వదిలేస్తుంటారు. కానీ ఈ నోటీసును విస్మరిస్తే భవిష్యత్తులో ఐటీ శాఖ లోతుగా విచారణ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి నోటీసు రాగానే రికార్డులను తనిఖీ చేసుకుని, సరైన వివరణ ఇవ్వడం లేదా తప్పులను సరిదిద్దుకోవడం బెస్ట్.