
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతామరన్.. బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపులు చేయకపోవడం రాష్ట్ర ప్రజలను నిరాశ పరిచిందనడంలో సందేహం లేదు. బీహార్‌పై వరాల జల్లు కురిపించిన ఈ తెలుగింటి ఆడపడచు.. తెలుగు రాష్ట్ర అభివృద్ధికి వచ్చే సరికి మొండిచేయి చూపింది. రాష్ట్ర ప్రభుత్వం అడిగిన ఏ ఒక్కదానికి కేటాయింపులు జరపలేదు. అయితేనేం.. పెంచిన ఆదాయ పన్ను పరిమితి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడనున్నట్లు నివేదికలు చెప్తున్నాయి.
కేంద్ర ఆర్థిక మంత్రి 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆదాయపు పన్ను పరిమితిని రూ.12 లక్షలకు పెంచారు. ఈ మొత్తానికి స్టాండర్డ్ డిడక్షన్ రూ.75వేలు కలుపుకుంటే.. రూ.12.75 లక్షలదాకా పన్నులు చెల్లించనక్కర్లేదు. ఇది మధ్యతరగతి ప్రజల పన్నులను గణనీయంగా తగ్గిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగస్తుల చేతుల్లో నాలుగు రాళ్లు మిగుల్చుతోంది.
ఈ ఆదాయ పన్ను మినహాయింపును ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజలు బాగానే ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. కట్టాల్సిన పన్ను తగ్గింది కనుక ఆ మొత్తాన్ని ఇళ్ల కొనుగోళ్లకు ఉపయోగిస్తున్నారట. రియల్ ఎస్టేట్ సేవల సంస్థ ANAROCK నివేదికల ప్రకారం.. బడ్జెట్‌లో గృహనిర్మాణ రంగానికి ప్రధాన ప్రకటనలు లేకపోవడం వాటాదారులను నిరాశపరిచినప్పటికీ, ఆదాయ పన్ను మినహాయింపు ఉపశమనాన్ని కలిగిస్తున్నట్లు వెల్లడించింది. రూ. 12 లక్షల వరకు ఆదాయం పన్ను మినహాయింపు ఉండటం వల్ల.. నగరంలో ఇళ్ల కొనుగోళ్లు పెరిగాయని పేర్కొంది. రాబోవు రోజుల్లో ఇది మరింత ఊపందుకుంటుందని వెల్లడించింది.