- పారిశుధ్యం, పన్నులు, నీటి సరఫరాపై ప్రత్యేక నిఘా
- వానాకాలానికి ముందే డ్రైనేజీలు, రోడ్లకు మరమ్మతులు
- సర్పంచ్‌లు, కార్యదర్శులకు క్షేత్రస్థాయి బాధ్యతలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పల్లెల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పారిశుధ్య మెరుగుదలే లక్ష్యంగా 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రకటించింది. ఈ నెల 6 నుంచి మే 31 వరకు ఏ రోజు ఏ పని పూర్తి చేయాలో స్పష్టమైన గడువు విధిస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
పన్నుల వసూలు నుంచి తాగునీటి సరఫరా వరకు, ఉపాధి హామీ పనుల నుంచి హరితహారం వరకు ప్రతి అంశాన్ని ఈ షెడ్యూల్‌లో పొందుపరిచారు. ఈ నెలలో ప్రధానంగా గ్రామాల్లో పరిశుభ్రత, పంచాయతీల ఆర్థిక బలోపేతంపై దృష్టి సారించారు. ఈ నెల 6 నుంచి 15 వరకు పారిశుధ్యంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించారు. వీధుల్లో బ్లీచింగ్ పౌడర్చల్లడం, తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయడం వంటి పనులు పూర్తి చేయనున్నారు.
16 నుంచి 31 వరకు ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న తరుణంలో 100 శాతం పన్నుల వసూలే లక్ష్యంగా ముందుకెళ్లనున్నారు. కొత్త ఇళ్లకు పన్నుల విధింపు, ట్రేడ్ లైసెన్సులు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, మార్కెట్ల వేలం ప్రక్రియను ముగించి ఖజానా నింపాలని ఆదేశించారు. ఇదే సమయంలో మహిళా సంఘాల రుణాల రికవరీని వేగవంతం చేయాల్సి ఉంటుంది.
ఉపాధి పనుల్లో వేగం..
మే 1నుంచి 15 వరకు ఉపాధి హామీ పనుల వేగం పెంచాలని ప్లాన్ రెడీ చేశారు. పొలాల్లో ఫార్మ్ పాండ్స్, చెక్ డ్యాంలలో పూడికతీత, పశువుల పాకలు, న్యూట్రీ గార్డెన్ల పనులు పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. మే 16 నుంచి 31 వరకు రుతుపవనాలు వచ్చేలోపు డ్రైనేజీల్లో పూడిక తీయాలని టార్గెట్ పెట్టుకున్నారు. లోతట్టు ప్రాంతాల్లో మొరం పోసి నీరు నిల్వకుండా చూడటంతోపాటు దోమల నివారణకు యాంటీ లార్వా మందులు చల్లనున్నారు.
అంతేకాకుండా, రాబోయే హరితహారం కోసం మే చివరి వారంలోనే మొక్కలు నాటేందుకు గుంతలు తీసి సిద్ధం చేయాలి. నర్సరీల్లో మొక్కల పెంపకాన్ని పర్యవేక్షించాలి. రోడ్ల పక్కన పిచ్చిమొక్కల తొలగింపు, కల్వర్టుల క్లీనింగ్, సైన్ బోర్డుల ఏర్పాటు, గ్రామ పంచాయతీ భవనాలకు పెయింటింగ్, స్లాబ్ లీకేజీల మరమ్మతులు పూర్తి చేయాలని సర్కార్ ఆదేశించింది.
ఈ షెడ్యూల్‌ను తప్పకుండా పాటించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. పల్లెల్లో 99 రోజుల యాక్షన్ ప్లాన్ విజయవంతంగా అమలు చేసే బాధ్యతలను సర్పంచులు, కార్యదర్శులు, క్షేత్రస్థాయి అధికారులకు అప్పగించింది.
తాగునీటి ఎద్దడి నివారణకు..
ఏప్రిల్ లో ఎండల తీవ్రత నేపథ్యంలో నీటి ఎద్దడి రాకుండా సర్కార్ చర్యలకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 1 నుంచి 15 వరకు తాగునీటి సరఫరా వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు పైప్‌లైన్ల లీకేజీలు అరికట్టడం, మోటార్లకు మరమ్మతులు, చేతిపంపుల బాగు, కొత్త నల్లా కనెక్షన్ల వంటి పనులు చేపట్టనున్నారు. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు చెత్త నిర్వహణపై ఫోకస్ పెట్టనున్నారు. తడి, పొడి చెత్త సేకరణపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ఇంకుడు గుంతల నిర్మాణం, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. డంపింగ్ యార్డులు, కంపోస్ట్ షెడ్లను నిరంతరం పర్యవేక్షించనున్నారు.
