పెరిగిన డిజిటల్ పేమెంట్స్..లాభాల్లో ఫిన్‌‌టెక్‌‌ కంపెనీలు

పెరిగిన డిజిటల్ పేమెంట్స్..లాభాల్లో ఫిన్‌‌టెక్‌‌ కంపెనీలు
  •   10 ఏళ్లలో రూ. 73 వేల కోట్ల పెట్టుబడులు
  •     యూనికార్న్‌‌లలో ఈ ఇండస్ట్రీ నుంచే ఎక్కువ కంపెనీలు
  •     యూపీఐ రావడంతో పెరిగిన వేగం
  •     క్రెడిట్ సూజ్ రిపోర్ట్‌‌లో వెల్లడి

దేశంలో ఫిన్‌‌టెక్‌‌(ఫైనాన్షియల్ టెక్నాలజీ) ఇండస్ట్రీ వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా డిజిటల్‌‌ పేమెంట్స్‌‌ సర్వీస్‌‌లను అందించే కంపెనీలు, అప్పులను ఇచ్చే స్టార్టప్‌‌లు పెరుగుతున్నాయి. గత పదేళ్లలో  ఫిన్‌‌టెక్ ఇండస్ట్రీలోకి 10 బిలియన్‌‌ డాలర్ల(రూ.73 వేల కోట్లు)  విలువైన ఇన్వెస్ట్‌‌మెంట్స్ వచ్చాయని గ్లోబల్ వెల్త్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ కంపెనీ క్రెడిట్‌‌ సూస్‌‌ ఓ రిపోర్ట్‌‌లో పేర్కొంది. ఈ ఇన్వెస్ట్‌‌మెంట్స్‌‌ కూడా కేవలం ఈక్విటీ (షేర్లను)లను అమ్మడం ద్వారా వచ్చాయని తెలిపింది. ‘100 యూనికార్న్స్‌‌: ఇండియాస్‌‌ చేంజింగ్‌‌ కార్పొరేట్ ల్యాండ్‌‌స్కేప్‌‌’ పేరుతో ఈ రిపోర్ట్‌‌ను కంపెనీ విడుదల చేసింది. గ్లోబల్‌‌గా అమెరికా, చైనా తర్వాత ఇండియాలోనే ఎక్కువ యూనికార్న్‌‌లు ఏర్పడ్డాయని ఈ రిపోర్ట్ పేర్కొనడం విశేషం. వీటి వాల్యుయేషన్‌‌ 90 బిలియన్ డాలర్లుగా ఉందని  అంచనావేసింది. ఇండియన్‌‌ యూనికార్న్‌‌లలో ఫిన్‌‌టెక్‌‌ ఇండస్ట్రీ నుంచి ఉన్న కంపెనీలే ఎక్కువగా ఉన్నాయి.  ఈ ఇండస్ట్రీ యూనికార్న్‌‌ల వాల్యూయేషన్‌‌ 22 బిలియన్‌‌ డాలర్లుగా ఉందని క్రెడిట్‌‌ సూస్‌‌ రిపోర్ట్‌‌ తెలిపింది. కాగా, ఫిన్‌‌టెక్‌‌ ఇండస్ట్రీలో ఈ–కామర్స్ కంపెనీలు కూడా కలిసున్నాయి.
 
డిజిటల్‌‌గానే అప్పులు..

కరోనా సంక్షోభంతో ఆన్‌‌లైన్‌‌లో చేస్తున్న ఖర్చులు  పెరిగాయని క్రెడిట్ సూస్‌‌ రిపోర్ట్‌‌ పేర్కొంది. క్రెడిట్ కార్డు ఖర్చులను అంచనావేయడం ద్వారా ఈ విషయాన్ని తేల్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లోనే ఆన్‌‌లైన్‌‌ ద్వారా చేస్తున్న ఖర్చులు 10 శాతం పెరిగి 53 శాతానికి చేరుకుందని ఈ రిపోర్ట్ తెలిపింది. అంతేకాకుండా ప్రజలు కూడా ఆఫ్‌‌లైన్‌‌ నుంచి ఆన్‌‌లైన్ షాపింగ్‌‌కు వేగంగా మారుతున్నారని అంచనావేసింది. ‘కరోనా వలన గ్లోబల్‌‌గా కమ్యూనికేషన్‌‌, షాపింగ్‌‌, పేమెంట్‌‌ సర్వీస్‌‌లలో డిజిటల్‌‌కు మారడం పెరిగింది. ప్రస్తుతం సంక్షోభం నుంచి బయటపడుతుండడంతో తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంటున్నా, షాపింగ్‌‌, పేమెంట్స్ సెగ్మెంట్‌‌లో కింది స్థాయిలో మార్పు ఏర్పడింది’ అని  ఆశిష్ గుప్తా అన్నారు. 
ఆన్‌‌లైన్‌‌లో లోన్లిచ్చే వారు పెరుగుతున్నారని క్రెడిట్ సూజ్ అంచనావేసింది. ఈ సెగ్మెంట్ వాటా 10 బిలియన్ డాలర్లకు చేరుకుందని, ప్రస్తుతం కొత్తగా ఇష్యూ అవుతున్న పర్సనల్‌‌, కన్జూమర్‌‌‌‌ డ్యూరబుల్‌‌ లోన్లలో డిజిటల్‌‌ లెండర్ల వాటా 40 శాతానికి పెరిగిందని తెలిపింది. బ్యాంకులతో పార్టనర్‌‌‌‌షిప్‌‌ కుదుర్చుకొని మరిన్ని క్రెడిట్‌‌ సర్వీస్‌‌లను ఫిన్‌‌టెక్ కంపెనీలు అందిస్తున్నాయని ఈ రిపోర్ట్‌‌ తెలిపింది. డిజిటల్‌‌ బిజినెస్‌‌లో బ్యాంకుల వాటా పెరగడానికి ఇది తోడ్పడుతోందని పేర్కొంది. సొంత యాప్‌‌లతో పాటు, డిజిటల్‌‌ పేమెంట్‌‌ కంపెనీలతో పార్టనర్‌‌‌‌ షిప్‌‌ కుదుర్చుకొని బ్యాంకులు తమ డిజిటల్ సర్వీస్‌‌లను విస్తరిస్తున్నాయి. కొత్తగా ఇష్యూ అవుతున్న క్రెడిట్ కార్డులలో ఎస్‌‌బీఐ, పెద్ద ప్రైవేట్ బ్యాంకులకు చెందిన యాప్‌‌ల ద్వారానే 75 శాతం వరకు ఇష్యూ అవుతున్నాయని క్రెడిట్‌‌ సూస్‌ పేర్కొంది. 

10 రెట్లు పెరిగిన ఆన్‌‌లైన్ పేమెంట్స్‌‌

ఈ రిపోర్ట్‌‌ ప్రకారం గత పదేళ్లలో డిజిటల్‌‌ పేమెంట్స్‌‌ సర్వీస్‌‌లను అందించే స్టార్టప్‌‌లు 4.2 బిలియన్‌‌ డాలర్లను సమీకరించగలిగాయి. అప్పులిచ్చే స్టార్టప్‌‌లు 2.5 బిలియన్‌‌ డాలర్లను సేకరించాయి. ‘గత పదేళ్లలో ఇండియన్ ఫిన్‌‌టెక్‌‌ కంపెనీలు 10 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్‌‌మెంట్లను ఆకర్షించగలిగాయి. దేశ స్టార్టప్‌‌ ఎకోసిస్టమ్‌‌ను ఈ కంపెనీలు ముందుండి నడిపిస్తున్నాయి. ఫిన్‌‌టెక్‌‌ ఇండస్ట్రీ వేగంగా విస్తరించడానికి ముఖ్య కారణం డిజిటల్ పేమెంట్స్‌‌ సెగ్మెంటే. గత ఐదేళ్లలో ఈ సెగ్మెంట్‌‌ 10 రెట్లు పెరిగింది. ప్రస్తుతం ఫిన్‌‌టెక్‌‌ ఇండస్ట్రీ సైజ్‌‌లో ఈ సెగ్మెంట్‌‌ వాటా30 శాతంగా ఉంది’ అని క్రెడిట్‌‌ సూస్‌‌  ఇండియా సెక్యూరిటీస్‌‌ రీసెర్చ్‌‌ హెడ్‌‌ ఆశిష్‌‌ గుప్తా అన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన యూపీఐ వంటి పేమెంట్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌ సాయంతో  దేశంలో డిజిటల్ పేమెంట్స్‌‌ వేగంగా విస్తరిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం డిజిటల్‌‌ పేమెంట్స్‌‌ విలువ ఏడాదికి సగటున 450 బిలియన్ డాలర్లకు చేరుకుందని అంచనావేశారు. ప్రస్తుతం దేశంలో 20 కోట్ల యూజర్లు డిజిటల్ పేమెంట్స్‌‌ను యాక్టివ్‌‌గా వాడుతున్నారు. సుమారు 3 కోట్ల మంది వ్యాపారులు ఆన్‌‌లైన్‌‌ పేమెంట్స్‌‌కు ఒప్పుకుంటున్నారని క్రెడిట్ సూస్‌‌ రిపోర్ట్ అంచనావేసింది. దేశంలో డిజిటల్ పేమెంట్స్ వేగంగా విస్తరించడంలో యూపీఐ కీలకంగా ఉందని తెలిపింది.