పెరిగిన యాదాద్రి నర్సన్న సేవల రేట్లు

పెరిగిన యాదాద్రి నర్సన్న సేవల రేట్లు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి నిత్య పూజలు, నిత్య కైంకర్యాలు, లడ్డూప్రసాదాల రేట్లు భారీగా పెరిగాయి. యాదాద్రితో పాటు అనుబంధ ఆలయమైన పాతగుట్ట నరసింహస్వామి దేవస్థానంలో కూడా రేట్లను పెంచారు. రోజురోజుకూ నిత్యావసర ధరలు పెరుగుతున్న నేపథ్యంలో.. అందుకనుగుణంగా రేట్లు పెంచుతున్నట్లు టెంపుల్ ఈవో గీతారెడ్డి గురువారం ప్రకటించారు. పెంచిన రేట్లు శుక్రవారం 10 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించారు. పెంచిన రేట్లు సామాన్య భక్తులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.  కరోనా కారణంగా వరుస లాక్ డౌన్ లతో ఆర్థికంగా నష్టపోయిన భక్తులకు యాదాద్రిలో పెంచిన రేట్లు 'మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు' గా ఉంది. రేట్ల పెంపుతో సామాన్య భక్తులు ఫ్యామిలీతో యాదాద్రికి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి.

అన్నింటి రేట్లు పెంపు
యాదాద్రి, పాతగుట్టలో జరిగే 25 రకాల నిత్య కైంకర్యాలు, 18 రకాల భోగాలు, 8 రకాల శాశ్వత పూజలు, లడ్డూ, పులిహోరా రేట్లను ఆఫీసర్లు పెంచారు. అలాగే శివాలయంలో నిర్వహించే 13 రకాల నిత్య కైంకర్యాల రేట్లను కూడా పెంచారు. 100 గ్రాముల లడ్డూ ధర రూ.20 నుంచి రూ.30, 500 గ్రాముల లడ్డూ ధర రూ.100 నుంచి రూ.150, 250 గ్రాముల పులిహోరా రూ.15 నుంచి రూ.20, 250 గ్రాముల వడ రూ.15 నుంచి రూ.20 కి పెంచారు.

ఇక ఆలయంలో నిర్వహించే నిత్య కల్యాణం టికెట్ల ధర రూ.1,250 నుంచి రూ.1,500, సుదర్శన నారసింహ హోమం టికెట్ల ధర రూ.1,116 నుంచి రూ.1,250, నిజాభిషేకం రూ.500 నుంచి రూ.800, శతఘటాభిషేకం రూ.750 నుంచి రూ.1,000, జోడు సేవలు రూ.500 నుంచి రూ.700, సువర్ణ పుష్పార్చన రూ.516 నుంచి రూ.600, లక్షపుష్పార్చన రూ.2,116 నుంచి రూ.2,500, ఊంజల్ సేవ రూ.750 నుంచి రూ.1,000కి పెంచారు. సత్యనారాయణస్వామి వ్రత టికెట్ ధర రూ.500 నుంచి రూ.800, ఉపనయనం రూ.50 నుంచి రూ.500, అక్షరాభ్యాసం రూ.51 నుంచి రూ.200, అష్టోత్తర పూజ రూ.100 నుంచి రూ.200, అన్నప్రాసన రూ.500 నుంచి రూ.1,000 కు పెరిగాయి. అదేవిధంగా శివాలయంలో రుద్రాభిషేకం రూ.116 నుంచి రూ.200, శివ కల్యాణం టికెట్ రూ.250 నుంచి రూ.500, ఊరేగింపు సేవ రూ.116 నుంచి రూ.200 కు పెంచారు.