తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ.. దర్శన సమయం పొడిగింపు

తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ.. దర్శన సమయం పొడిగింపు

తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా వీఐపీ బ్రేక్‌లను రద్దు చేసి దర్శన సమయాన్ని పొడిగించాలని టీటీడీ నిర్ణయించింది. నిత్యం 15 గంటల దర్శనం కల్పించడంతోపాటు తిరుమలలో 85 శాతం వసతి సౌకర్యాలు కల్పించడం ద్వారా సాధారణ యాత్రికులకే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ నిర్ణయించినట్లు టీటీడీ కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. 

తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఏప్రిల్ 7న నిర్వహించిన 'డయల్ యువర్ ఈఓ' కార్యక్రమంలో వీఐపీ బ్రేక్‌లను తగ్గించాలని, సాధారణ యాత్రికుల దర్శన వేళలను పెంచాలని ఓ కాలర్ సూచించారు. దీనికి సమాధానంగా18 గంటల్లో వీఐపీలకు మూడు గంటలు, సాధారణ యాత్రికులకు మిగిలిన 15 గంటల సమయం కల్పిస్తామని ఈవో తెలిపారు. 

వేసవి రద్దీ దృష్ట్యా సామాన్య భక్తులకు అదనపు దర్శన వేళలు కల్పించేందుకు ఏప్రిల్ 15 నుంచి ప్రారంభమయ్యే వీఐపీ రిఫరల్స్, రూ.300, శ్రీవాణి, వర్చువల్ సేవ, పర్యాటక టిక్కెట్లను జూలై 15 వరకు తగ్గించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. సాధారణ యాత్రికుల కోసం 85% వసతి, 7,400 గదులు, నాలుగు పీఏసీలు అందుబాటులో ఉంటాయని ఈవో స్పష్టం చేశారు.