రెండో వన్డేలోనూ ఓడిన భారత్.. సిరీస్ ఆస్ట్రేలియాకే

రెండో వన్డేలోనూ ఓడిన భారత్.. సిరీస్ ఆస్ట్రేలియాకే

51 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా

సిడ్నీ: భారీ టార్గెట్ ను ఛేదించలేక టీమిండియా చేతులెత్తేసింది. వరుసగా రెండో వన్డేలోనూ పరాజయం పాలైంది. 51 పరుగుల తేడాతో భారత్ ను ఓడించి సిరీస్ ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. మొత్తం మూడు వన్డేలు ఆడుతోంది. కరోనా లాక్ డౌన్ తర్వాత చాలా కాలం అంతర్జాతీయ క్రికెట్ పోటీలు జరగని విషయం తెలిసిందే. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఆదివారం సిడ్నీ మైదానంలో రెండో వన్డే జరిగింది. తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ అరోన్ ఫించ్ బ్యాటింగ్ ఎన్నుకున్నాడు. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్న మైదానంలో ఆసీస్ ఆటగాళ్లు చెలరేగిపోయారు. 50 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి 389 పరుగులు చేశారు. స్టీవ్ స్మిత్ బ్యాట్ ఝుళిపించి కదం తొక్కి సెంచరీ చేశాడు. ఓపెనర్లు సహా మొత్తం ఐదుగురు  అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. డేవిడ్ వార్నర్ (83), అరోన్ ఫించ్ (60) భారత బౌలర్లను వీలుచిక్కినప్పుడల్లా చితకొట్టి గట్టి పునాది వేశారు. తర్వాత బ్యాటింగ్ కు దిగిన స్టీవ్ స్మిత్ చెలరేగిపోయాడు. మైదానం నలువైపులా యధేచ్చగా షాట్లు కొడుతూ.. కేవలం 62 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. మొత్తం 64 బంతుల్లో 104 పరుగులు చేయగా.. తర్వాత బ్యాటింగ్ చేసిన వాళ్లు కూడా ముందు ఆడిన వారి బాటలోనే బౌలర్లను రప్ఫాడించారు.  గ్లెన్ మ్యాక్స్ వెల్  63 పరుగులు, మార్నస్ లబుస్చేంజ్ 70 పరుగులు చేయంతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు 389 పరుగులు చేసింది.

భారత ఓపెనర్లు శుభారంభం చేసినా.. అర్ధసెంచరీలు దాటింది ఇద్దరే

390 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ తొలి ఓవర్లలో శుభారంభం చేసింది. ఓపెనర్లు శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్ ధాటిగా ఆడుతూ ఆస్ట్రేలియా బౌలర్లపై ఆధిపత్యం కనబరిచారు. అయితే 8వ ఓవర్లో ధాటిగా ఆడుతున్న ధావన్ వ్యక్తిగత స్కోరు 30 పరుగుల వద్ద జోష్ హజిల్వుడ్ చేతిలో ఓటయ్యాడు. అవతలి ఎండ్ లో ధాటిగా ఆడుతున్న మయాంక్ అగర్వాల్ ను పాట్ కమిన్స్ ఔట్ చేశాడు. మయాంక్ 36 బంతుల్లో 38 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత బరిలోకి వచ్చిన కెప్టెన్ కోహ్లి.. బాధ్యతాయుతంగా ఆడుతూ గట్టెక్కించేలా కనపడ్డాడు. కెరీర్ లో 59వ అర్ధసెంచరీని పూర్తి చేశాడు. మరో వైపు కెఎల్ రాహుల్ కూడా ధాటిగా ఆడుతూ ఆశలు నిలబెట్టే ప్రయత్నం చేశాడు. 52 బంతుల్లో మూడు ఫోర్లు.. మూడు సిక్సర్లతో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కోహ్లి 87 బంతుల్లో 89 పరుగులు చేసి ఔట్ కాగా.. కేఎల్ రాహుల్ 66 బంతుల్లో 76 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత మిగిలిన వారంతా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. భారత్ 9 వికెట్లు కోల్పోయి 338 పరుగులు మాత్రమే చేయగలిగింది. 51 పరుగులతో రెండో వన్డేలోనూ ఘన విజయం సాధించిన ఆస్ట్రేలియా 3 వన్డేల సిరీస్ ను 2-0తో కైవసం చేసుకుంది. మూడో వన్డే కాన్ బెర్రాలో జరగనుంది.