- లెక్క సరిచేసేందుకు ఆసీస్ రెడీ
- మ. 1.45 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో లైవ్
బ్రిస్బేన్: ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ విజయానికి అడుగు దూరంలో ఉన్న టీమిండియా ఐదో టీ20 మ్యాచ్‌కు రెడీ అయ్యింది. శనివారం ఆసీస్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ బలహీనతలను అధిగమించాలని భావిస్తోంది. ఫలితంగా విజయంతో టూర్‌ను ఘనంగా ముగించాలని యోచిస్తోంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం ఇండియా 2–1 ఆధిక్యంలో ఉంది. ఇక 17 ఏళ్లుగా ఆసీస్‌పై ఇండియా టీ20 సిరీస్‌ను చేజార్చుకోలేదు. ఇప్పుడు ఈ సిరీస్‌ను కూడా గెలిచి ఆ రికార్డును కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. నాలుగో మ్యాచ్‌లో ఆడిన జట్టునే ఇండియా యధావిధిగా బరిలోకి దించుతోంది.
ఈ నేపథ్యంలో కెప్టెన్ సూర్య వైస్ కెప్టెన్ గిల్ ఫామ్‌పై ఆందోళన కొనసాగుతోంది. వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్‌కు టైమ్ దగ్గరపడుతుండటంతో వీళ్లిద్దరు ఫామ్‌లోకి రావడం అత్యవసరం. గత ఏడు ఇన్నింగ్స్‌ల్లో గిల్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. కానీ నాలుగో టీ20లో 46 రన్స్ చేసి కొద్దిగా మెరుగయ్యాడు. కాబట్టి ఈ మ్యాచ్‌లో అతను చెలరేగాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మిడిలార్డర్‌లో భారీ ఆశలు పెట్టుకున్న తిలక్ వర్మ వైఫల్యం టీమ్ స్కోరును వెంటాడుతోంది. ఓపెనర్ అభిషేక్ శర్మ టాప్ ర్యాంక్ టీ20 హిట్టర్‌గా తన పేరును సుస్థిరం చేసుకుంటున్నాడు. వికెట్ కీపర్ జితేశ్ శర్మ గాడిలో పడాల్సి ఉంది.
లోయర్ ఆర్డర్‌లో అక్షర్ పటేల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడటం.. 7, 8వ స్థానాల్లో ఆల్‌రౌండర్లు ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశాలు. బౌలింగ్‌లో అర్ష్‌దీప్ తన విలువేంటో మరోసారి రుజువు చేసుకున్నాడు. బుమ్రాతో కలిసి కొత్త బాల్‌తో అద్భుతమైన ప్రభావం చూపిస్తున్నాడు. రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లేకపోయినా.. వరుణ్ చక్రవర్తి, అక్షర్, సుందర్‌తో కూడిన స్పిన్ త్రయం టీమిండియాకు ప్రధాన బలంగా మారింది. శివమ్ దూబే, సుందర్ బ్యాటింగ్‌లోనూ రాణిస్తుండటం అనుకూలంగా మారింది.
స్పిన్‌ను జయిస్తే..
ఈ మ్యాచ్‌లో ఓడితే సిరీస్ చేజారే ప్రమాదం ఉండటంతో ఆసీస్ కూడా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఇది జరగాలంటే ఇండియా స్పిన్‌ను దీటుగా ఎదుర్కోవాలని లెక్కలు వేస్తోంది. కెప్టెన్ మార్ష్ పోరాటం చేస్తున్నా.. రెండో ఎండ్‌లో సరైన సహకారం లభించడం లేదు. దీంతో ప్రత్యేకంగా బ్యాటింగ్ ఆర్డర్‌పై మరోసారి దృష్టి సారించింది. ట్రావిస్ హెడ్ లేకపోవడంతో భారీ హిట్టింగ్ కరువైంది. మ్యాక్స్‌వెల్, స్టోయినిస్, టిమ్ డేవిడ్‌పై ఆశలు పెట్టుకున్నా సక్సెస్ కావడం లేదు.
మాథ్యూ షార్ట్ ఓపెనర్ పాత్రకు న్యాయం చేయడం లేదు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గాడిలో పడతాడేమో చూడాలి. బౌలింగ్‌లో హాజిల్‌వుడ్ లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పేసర్ ఎలిస్, స్పిన్నర్ జంపాపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. డ్వార్షుయిస్ ప్రభావం చూపించాల్సిన టైమ్ వచ్చేసింది. ఫిలిప్ ప్లేస్‌లో మిచెల్ ఓవెన్ రావొచ్చు. లేదంటే మహ్లి బియర్డ్‌మాన్‌కు అరంగేట్రం చాన్స్ దక్కొచ్చు.
జట్లు (అంచనా)
ఇండియా: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జితేష్ శర్మ, శివమ్ దూబే, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్ (కెప్టెన్), మ్యాట్ షార్ట్, జోష్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్ / జోష్ ఫిలిప్, మార్కస్ స్టోయినిస్, మ్యాక్స్‌వెల్, బార్ట్‌లెట్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎలిస్, ఆడమ్ జంపా.
పిచ్, వాతావరణం
- పేస్, బౌన్స్‌కు అనుకూలం. సీమర్లు ప్రభావం చూపిస్తారు. బ్యాటర్లు నిలకడ చూపితే రన్స్ కూడా భారీగా వచ్చే అవకాశం ఉంది. బీబీఎల్‌లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. వర్షం ముప్పు ఉంది.
- 1ఒక్క వికెట్ తీస్తే బుమ్రా టీ20ల్లో వంద వికెట్ల క్లబ్‌లో చేరతాడు. ఇండియా తరఫున మూడు ఫార్మాట్లలో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డు సాధిస్తాడు.
- 32016లో జరిగిన క్లీన్‌స్వీప్ తర్వాత ఇండియా ఇప్పటి వరకు ఆసీస్‌పై వరుసగా మూడు టీ20లు గెలవలేదు.
