ఇంగ్లాండ్‌తో కాదు.. వర్షంతోనే భారత్ పోరు.. మాంచెస్టర్‌లో రేపు మ్యాచ్ జరిగేనా?

ఇంగ్లాండ్‌తో కాదు.. వర్షంతోనే భారత్ పోరు.. మాంచెస్టర్‌లో రేపు మ్యాచ్ జరిగేనా?

IND vs ENG 2nd T20I: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య రేపు ( జులై 4న, శనివారం) మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరగబోయే రెండో మ్యాచ్‌కైనా వాతావరణం అనుకూలించాలని ఇరు జట్లతో పాటు అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. చెస్టర్-లీ-స్ట్రీట్‌లో జరిగిన మొదటి మ్యాచ్ భారీగా కురిసిన వర్షం కారణంగా ఇంగ్లాండ్ కనీసం ఒక్క బంతి కూడా ఆడకుండానే రద్దయింది. దీంతో ప్రస్తుతం 0–0తో సమంగా ఉన్న ఈ సిరీస్‌లో ఎలాగైనా గెలిచి ఆధిక్యం సాధించాలని ఇరు జట్లు కసితో ఉన్నాయి.  

తొలి మ్యాచ్‌లో భారత్ మెరుపులు: 
మొదటి టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు ప్రారంభంలోనే వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఆ తర్వాత ఓపెనర్ అభిషేక్ శర్మ, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లు అద్భుతమైన హాఫ్ సెంచరీలతో రాణించి జట్టును ఆదుకున్నారు. చివర్లో శివమ్ దూబే మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 189/7 రన్స్ సాధించింది. కానీ ఇంగ్లాండ్ చేజ్ ప్రారంభించక ముందే వర్షం పడటంతో అంపైర్లు మ్యాచ్‌ను క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. 

►ALSO READ | భారత్‌ను ఓడించడం మా వల్ల కాదు.. టీమిండియాపై పాక్ హెడ్ కోచ్ ప్రశంసలు!

వాతావరణ అంచనా:  
మాంచెస్టర్ వాతావరణం క్షణక్షణానికి మారిపోతుందనే పేరున్నప్పటికీ.. తాజా అప్‌డేట్స్ ప్రకారం రేపు (శనివారం) దాదాపు 55 శాతం వర్షం పడే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో మ్యాచ్‌కు స్వల్ప ఆటంకాలు ఎదురైనా లేదా ఓవర్లను కుదించి మ్యాచ్ నిర్వహించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ పరిస్థితులు గనుక స్థిరంగా ఉంటే ఎలాంటి అంతరాయం లేకుండా పూర్తి మ్యాచ్ జరిగే ఛాన్స్ కూడా ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:00 గంటలకు ప్రారంభమవుతుంది.

ఇంతకీ వాన దేవుడు కరుణిస్తాడా: 
తొలి మ్యాచ్ రద్దు కావడంతో ఈ రెండో మ్యాచ్ ఒక రకంగా సిరీస్ ఓపెనర్‌గా మారిపోయింది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ముందంజ వేయడానికి ఇరు జట్లకు ఈ మ్యాచ్ విజయం అత్యంత కీలకంగా మారింది. మరి ఈ ఉత్కంఠభరిత పోరులో వాతావరణం కరుణించి పూర్తి మ్యాచ్ జరుగుతుందో లేదో అని ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు.