IND vs ENG: కెవిన్ పీటర్సన్‌కు క్షమాపణలు చెప్పిన శుభ్‌మాన్ గిల్

IND vs ENG: కెవిన్ పీటర్సన్‌కు క్షమాపణలు చెప్పిన శుభ్‌మాన్ గిల్

విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా విజ‌యం సాధించింది.  ఇంగ్లాండ్ ను 106 ప‌రుగుల‌ తేడాతో ఓడించి ఉప్పల్ పరాజయానికి బదులు తీర్చకుంది. భారత జట్టు నిర్ధేశించిన 399 పరుగుల ఛేదనలో ఇంగ్లాండ్‌ 292 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్ అనంతరం భారత ఓపెనర్ శుభ్‌మాన్ గిల్.. తనకు మద్దతుగా నిలిచిన ఇంగ్లాండ్ మాజీ దిగ్గజం కెవిన్ పీటర్సన్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. అదే సమయంలో అతనికి క్షమాపణలు చెప్పాడు.

 ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ ఓటమి అనంతరం జట్టు నుంచి శుభ్‌మాన్ గిల్ తప్పించాలనే మాటలు వినపడ్డాయి. తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగులు చేసిన గిల్.. రెండో ఇన్నింగ్స్ లో ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. దీంతో అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అతన్ని జట్టు నుంచి తప్పించి సర్ఫరాజ్ ఖాన్ వంటి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని అభిమానులు డిమాండ్ చేశారు. ఆ సమయంలో పీటర్సన్‌.. గిల్ కు మద్దతుగా నిలిచారు. సౌతాఫ్రికా మాజీ దిగ్గజం జాక్వెస్ కల్లిస్ తన మొదటి 10 టెస్ట్‌ల్లో 22 సగటును మాత్రమే కలిగి ఉన్నాడని.. ఆ తర్వాత అతను అత్యుత్తమ ఆటగాళ్ళలో ఒకరిగా ముగించాడని పేర్కొన్నారు. అలా గొప్ప క్రికెటర్ అవ్వాలంటే వెంటనే జరగవని.. గిల్‌కు మరింత సమయం ఇవ్వాలని పీటర్సన్ అభిమానులను కోరారు.

పీటర్సన్‌ అన్న ఈ మాటలు గిల్‌లో ప్రేరణ నింపినట్లు తెలుస్తోంది. రెండో టెస్టులో శతకం బాదిన గిల్(104).. మ్యాచ్ అనంతరం తనకు మద్దతుగా నిలిచిన ఇంగ్లాండ్ మాజీ దిగ్గజం కెవిన్ పీటర్సన్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. పేలవమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ అతనికి అండగా నిలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. అదే సమయంలో సెంచరీ చేశాక.. అతన్ని కలవనందుకు క్షమాపణలు చెప్పాడు. అందుకు గల కారణాన్ని వివరించాడు.

"నేను కలవనందుకు క్షమించండి. గాయపడిన వేలికి స్కాన్ చేయడానికి నేను అత్యవసరంగా వెళ్ళవలసి వచ్చింది.." అని గిల్ పీటర్సన్‌కు కారణాన్ని వివరిస్తూ చెప్పాడు. కాగా, వేలికి గాయం అవ్వడంతో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ సమయంలో గిల్ ఫీల్డింగ్‌కు రాలేదు. అతని స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ ఫీల్డింగ్‌కు వచ్చాడు.