చావో రేవో .. ఇంగ్లండ్‌‌తో ఇండియా నాలుగో టెస్టు.. గాయాలతో డీలా పడ్డ గిల్‌‌‌‌సేన.. నితీశ్‌‌‌‌, ఆకాశ్ లేకుండా బరిలోకి..

చావో రేవో .. ఇంగ్లండ్‌‌తో ఇండియా నాలుగో టెస్టు.. గాయాలతో డీలా పడ్డ గిల్‌‌‌‌సేన.. నితీశ్‌‌‌‌, ఆకాశ్ లేకుండా బరిలోకి..
  • చావో రేవో .. నేటి నుంచి ఇంగ్లండ్‌‌తో ఇండియా నాలుగో టెస్టు 
  • గాయాలతో డీలా పడ్డ గిల్‌‌‌‌సేన.. నితీశ్‌‌‌‌, ఆకాశ్ లేకుండా బరిలోకి
  • ఫుల్ జోష్‌‌‌‌లో ఇంగ్లిష్​ టీమ్‌‌‌‌.. మ. 3.30 నుంచి సోనీ స్పోర్ట్స్‌‌‌‌, జియో హాట్‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌లో లైవ్

మాంచెస్టర్‌‌‌‌‌‌‌‌: లార్డ్స్‌‌‌‌ టెస్టులో ఓటమి దెబ్బకు తోడు కీలక ఆటగాళ్ల గాయాలతో డీలా పడ్డ టీమిండియా.. ఇంగ్లండ్‌‌‌‌ గడ్డపై అత్యంత కఠిన పరీక్షకు సిద్ధమైంది. ఐదు టెస్టుల సిరీస్‌‌‌‌లో భాగంగా బుధవారం మొదలయ్యే నాలుగో మ్యాచ్‌‌‌‌లో ఫుల్ కాన్ఫిడెన్స్‌‌‌‌తో ఉన్న ఆతిథ్య ఇంగ్లిష్ టీమ్‌‌‌‌ను ఢీకొట్టనుంది. అత్యంత ఆసక్తికరంగా సాగుతున్న ఈ సిరీస్‌‌‌‌ను సమం చేయాలంటే ఓల్డ్‌‌‌‌ ట్రాఫోర్డ్‌ స్టేడియంలో తమ పేలవ రికార్డును తిరగరాయడం ఇండియాకు తప్పనిసరి. 

ఈ గ్రౌండ్‌‌‌‌లో ఇప్పటివరకు ఆడిన 9 టెస్టుల్లో ఒక్కసారి కూడా గెలవలేదు. 4 ఓటములు, 5 డ్రాలతో సరిపెట్టింది. సిరీస్‌‌‌‌లో చావోరేవో తేల్చుకునే ఈ  పోరులో గిల్‌‌‌‌సేన అనివార్యమైన పలు మార్పులతో బరిలోకి దిగనుంది. ఇంకోవైపు రెండో టెస్టులో ఘోర ఓటమి తర్వాత లార్డ్స్‌‌‌‌లో థ్రిల్లింగ్ విక్టరీతో 2–1తో ఆధిక్యంలోకి వచ్చిన  బెన్ స్టోక్స్ సేన రెట్టించిన ఉత్సాహంతో  ఉంది. అదే జోరుతో మరో విక్టరీ అందుకొని మాంచెస్టర్‌‌‌‌‌‌‌‌లోనే సిరీస్‌‌‌‌ను పట్టేయాలని చూస్తోంది. దాంతో ఇంకో  థ్రిల్లింగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ టెస్టు ఫ్యాన్స్‌‌‌‌ను ఫిదా చేయడం ఖాయం అనిపిస్తోంది. 

కాంబినేషన్‌‌‌‌ కష్టాలు..
తొలి టెస్టు పరాజయం తర్వాత  ముగ్గురు ఆల్‌‌‌‌రౌండర్లతో టీమిండియా ఓ పర్ఫెక్ట్ టీమ్ కాంబినేషన్‌‌‌‌ను రెడీ చేసుకుంది. బర్మింగ్‌‌‌‌హామ్‌‌‌‌లో గ్రాండ్ విక్టరీ సాధించిన గిల్ సేన.. లార్డ్స్‌‌‌‌లోనూ గెలుపు అంచులోకి వచ్చింది. అయితే, మోకాలి గాయంతో ఆల్‌‌‌‌రౌండర్ నితీశ్ రెడ్డి సిరీస్‌‌‌‌ నుంచి వైదొలగడంతో పాటు గజ్జల్లో నొప్పితో పేసర్‌‌‌‌‌‌‌‌ ఆకాశ్‌‌‌‌ దీప్‌‌‌‌ నాలుగో టెస్టుకు దూరమవడంతో టీమ్‌‌‌‌ కాంబినేషన్‌‌‌‌ను మార్చాల్సిన అవసరం ఏర్పడింది. తొలి మ్యాచ్‌‌‌‌లో ఆడిన శార్దూల్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌‌‌‌‌.. నితీశ్ రెడ్డికిపర్ఫెక్ట్ రీప్లేస్‌‌మెంట్.  కానీ, తనలో నితీశ్ మాదిరి బ్యాటింగ్‌‌‌‌ క్వాలిటీ లేదు. ఒకవేళ తుది జట్టులోకి వస్తే బౌలర్‌‌‌‌‌‌‌‌గా అయినా మెరుగైన పెర్ఫామెన్స్ చేయాల్సిన అవసరం ఉంది.

ఇక బర్మింగ్‌‌‌‌హామ్‌‌‌‌లో పది వికెట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఆకాశ్‌‌‌‌ లేకపోవడం పెద్ద దెబ్బ. తన ప్లేస్‌‌‌‌లో యంగ్‌‌‌‌ పేసర్ అన్షుల్ కంబోజ్‌‌‌‌ అరంగేట్రం చేసే చాన్స్ ఉందని కెప్టెన్ గిల్ హింట్‌‌‌‌ ఇచ్చాడు. అతనికి ప్రసిధ్ కృష్ణ నుంచి పోటీ ఉంది. అయితే,  పేస్‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌ బుమ్రా, సిరాజ్‌‌‌‌కు తోడు సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్‌‌‌‌ ప్యాకేజ్‌‌‌‌గా అన్షుల్‌‌‌‌ను బరిలోకి దింపితే ఫలితం ఉండొచ్చు. లార్డ్స్‌‌‌‌లో రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో టాప్, మిడిలార్డర్ ఫెయిల్యూర్ మినహాయిస్తే బ్యాటింగ్‌‌‌‌లో జట్టుకు పెద్ద సమస్యలు లేవు. ఓపెనర్‌‌‌‌‌‌‌‌ కేఎల్‌‌‌‌ రాహుల్ అత్యంత నిలకడగా ఆడుతుండగా..  సిరీస్‌‌‌‌లో ఇప్పటికే 600 ప్లస్ రన్స్ చేసిన గిల్ మరోసారి బ్యాట్ ఝుళిపించి జట్టును ముందుకు నడిపించాలని చూస్తున్నాడు.

మూడో టెస్టు రెండు ఇన్నింగ్స్‌‌‌‌ల్లోనూ ఫెయిలైన యంగ్ ఓపెనర్‌‌‌‌‌‌‌‌ యశస్వి జైస్వాల్‌‌‌‌.. ఓపిగ్గా క్రీజులో నిలవడంపై ఫోకస్ పెట్టాల్సి ఉంది. ముఖ్యంగా జోఫ్రా ఆర్చర్ ఎక్స్‌‌‌‌ట్రా పేస్‌‌‌‌ను ఎదుర్కోవడానికి పక్కాగా ప్రిపేర్ అవ్వాలి. చేతి వేలి గాయం నుంచి రిషబ్ పంత్‌‌‌‌ పూర్తిగా కోలుకోవడం జట్టుకు ఊరటనిచ్చే అంశం.లోయర్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌లో రవీంద్ర జడేజా అదరగొడుతుండటం ప్లస్ పాయింట్. ఇక, ఆరు ఇన్నింగ్స్‌‌‌‌ల్లో ఒక్క ఫిఫ్టీ కూడా చేయని కరుణ్ నాయర్‌‌‌‌పై విమర్శలు వస్తున్నాయి. కానీ  కెప్టెన్ గిల్  సపోర్ట్‌‌‌‌ ఇస్తున్న  నేపథ్యంలో అతనికి మరో చాన్స్‌‌‌‌ రావొచ్చు.

తొలి టెస్టు మాదిరిగా కరుణ్‌‌‌‌, సాయి సుదర్శన్‌‌‌‌ ఇద్దరినీ తుది జట్టులోకి తీసుకొని జడేజాను ఏకైక స్పిన్‌‌‌‌ ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌గా కొనసాగించే  ఆప్షన్‌‌‌‌ను కూడా మేనేజ్‌‌‌‌మెంట్ పరిశీలిస్తోంది. అప్పుడు వాషింగ్టన్ సుందర్ బెంచ్‌‌‌‌పైకి వెళ్లనున్నాడు.  ఏదేమైనా లార్డ్స్ టెస్టులో చేసిన తప్పులను సరిదిద్దుకొని.. ఇంగ్లండ్‌‌‌‌కు ఏ చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా ఆడితేనే ఓల్డ్‌‌‌‌ ట్రాఫోర్డ్‌‌‌‌లో ఇండియా గెలుపు రుచి చూసి సిరీస్‌‌‌‌ రేసులో నిలవగలదు. 

కాన్ఫిడెన్స్‌‌‌‌లో స్టోక్స్‌‌‌‌ సేన
ఇండియా తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ఉండగా ఇంగ్లండ్ మాత్రం లార్డ్స్ విజయంతో సిరీస్ ఆధిక్యంలో ఉండి పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. కెప్టెన్ బెన్ స్టోక్స్ ఎప్పట్లానే తమ తుది జట్టును ముందే ప్రకటించాడు. గాయపడిన షోయబ్ బషీర్ స్థానంలో లెఫ్మార్ట్ స్పిన్ ఆల్‌‌‌‌రౌండర్ లియామ్ డాసన్‌‌‌‌ను జట్టులోకి తీసుకున్నారు. లార్డ్స్‌‌‌‌లో ఇరు జట్ల మధ్య మాటల దాడి కూడా జరగ్గా.. దాన్ని ఇంగ్లండ్ తమకు అనుకూలంగా మార్చుకుంది. ఇండియా కెప్టెన్ గిల్‌‌‌‌ తమ బ్యాటర్లను వెక్కిరించిన తర్వాత కసిగా ఆడింది. ప్రత్యర్థులు తమను రెచ్చగొడితే తామూ అస్సలు తగ్గబోమని బెన్ స్టోక్స్‌‌‌‌ స్పష్టం చేశాడు.

ఓల్డ్ ట్రాఫోర్ట్‌‌లో బెన్ స్టోక్స్‌‌‌‌,  జో రూట్‌‌‌‌, క్రిస్‌‌‌‌ వోక్స్‌‌‌‌కు మంచి రికార్డుంది. ఈ గ్రౌండ్‌‌‌‌లో స్టోక్స్‌‌‌‌ 52.63 సగటుతో 573 రన్స్ చేయగా..  రూట్ 19 ఇన్నింగ్స్‌‌‌‌ల్లో 65.20 సగటుతో ఏకంగా 978 రన్స్ సాధించాడు. క్రిస్ వోక్స్ ఏడు టెస్టుల్లో   35 వికెట్లు పడగొట్టాడు. దాంతో ఈ ముగ్గురిపై ఇంగ్లండ్ భారీ అంచనాలు పెట్టుకుంది. ఈ సిరీస్‌‌‌‌లో  ఆరు ఇన్నింగ్స్‌‌‌‌ల్లో  415 రన్స్ చేసిన జేమీ స్మిత్ కూడా కీలకం కానుంది. అయితే, ఇప్పటిదాకా సత్తా చాటని ఓపెనర్ జాక్ క్రాలీతో పాటు ఒలీ పోప్‌ నుంచి ఇంగ్లిష్ టీమ్ మెరుగైన పెర్ఫామెన్స్ ఆశిస్తోంది. ఇక, రీఎంట్రీలో లార్డ్స్‌‌‌‌ టెస్టులో అద్భుతంగా బౌలింగ్ చేసిన జోఫ్రా ఆర్చర్‌‌‌‌‌‌‌‌తో ఇండియాకు సవాల్ తప్పదు. 

తుది జట్లు
ఇండియా (అంచనా): జైస్వాల్, రాహుల్, కరుణ్, గిల్ (కెప్టెన్), పంత్ (కీపర్), సుదర్శన్, జడేజా, సుందర్/శార్దూల్, బుమ్రా, సిరాజ్, ప్రసిధ్‌‌‌‌/అన్షుల్‌‌‌‌ కంబోజ్.
ఇంగ్లండ్: జాక్ క్రాలీ, డకెట్, ఒలీ పోప్, రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ ( కీపర్), క్రిస్ వోక్స్, లియామ్ డాసన్, బ్రైడన్ కార్స్‌‌‌‌, జోఫ్రా ఆర్చర్.

పిచ్‌‌‌‌/వాతావరణం
లండన్‌‌‌‌తో పోలిస్తే మాంచెస్టర్‌‌‌‌లో వాతావరణం చాలా చల్లగా ఉండనుంది. రాబోయే  ఐదు రోజులు వర్ష సూచన ఉండటంతో  ఆటకు అంతరాయం కలగనుంది. ఈ సీజన్‌‌‌‌లో మే చివరి వరకు ఇక్కడ జరిగిన కౌంటీ మ్యాచ్‌‌‌‌ల్లో తొలి ఇన్నింగ్స్‌‌‌‌ల్లో భారీ స్కోర్లు వచ్చాయి. కానీ, కొన్నాళ్ల నుంచి వర్షాల కారణంగా వికెట్ స్వభావం మారి బౌలర్లకూ అనుకూలిస్తోంది. దాంతో టాస్ నెగ్గిన జట్టు బౌలింగ్‌‌‌‌కు మొగ్గు చూపొచ్చు.