IND vs ENG 2025: గంభీర్, మెకల్లమ్ ఏకాభిప్రాయం.. ఇద్దరు క్రికెటర్లకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్

IND vs ENG 2025: గంభీర్, మెకల్లమ్ ఏకాభిప్రాయం.. ఇద్దరు క్రికెటర్లకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్

ఇంగ్లాండ్ తో ఓవల్ టెస్టులో విజయంతో టీమిండియా ఆండర్సన్- టెండూల్కర్ ట్రోఫీని 2-2 తో సమం చేసింది. సిరీస్ అంతటా రెండు జట్లు అద్భుత ప్రదర్శన ఇచ్చాయి. సిరీస్ లో ప్రతి మ్యాచ్ ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్టు ఆడారు. ముఖ్యంగా బ్యాటర్లు ఈ సిరీస్ లో పరుగుల వరద పారించారు. టీమిండియా తరపున ఏకంగా ముగ్గురు ప్లేయర్లు 500 పైగా పరుగులు సాధించారు. మరోవైపు ఇంగ్లాండ్ తరపున ఈ సిరీస్ లో రూట్, బ్రూక్ నిలకడగా రాణించారు. సిరీస్ సమం కావడంతో పాటు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా ఇద్దరికి ప్రదానం చేశారు. ఒకరికి దక్కాల్సిన ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఇద్దరికి లభించడం వెనక కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.. 

ఆండర్సన్- టెండూల్కర్ సిరీస్ లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా ఇద్దరు ఆటగాళ్లను ఎంపిక చేశారు. టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్ ఒకరు కాగా.. ఇంగ్లాండ్ మిగిలి ఆర్డర్ బ్యాటర్ మరొకరు. సిరీస్ అంతటా అద్భుతంగా రాణించిన వీరిద్దరికీ రెండు జట్ల ప్రధాన కోచ్‌లు వారికి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. గిల్ ఐదు మ్యాచ్‌ల్లో ఆడి నాలుగు సెంచరీలతో 754 పరుగులు చేయగా.. బ్రూక్ ఐదు మ్యాచ్‌ల్లో 481 పరుగులు చేశాడు. సిరీస్ లో ఇద్దరూకూడా జట్టుకు అవసరమైనప్పుడు కీలక ఇన్నింగ్స్ లు ఆడారు. బ్రూక్ కు భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ అవార్డు ప్రదానం చేస్తే శుభ్‌మాన్ గిల్‌కు ఇంగ్లాండ్ ప్రధాన కోచ్ బ్రెండన్ మెకల్లమ్ అవార్డు ఇచ్చాడు. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా తొలి ఇన్నింగ్స్ 224 పరుగులకు ఆలౌటైంది. కరుణ్ నాయర్ 57 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిస్తే.. ఇంగ్లాండ్ పేసర్ అట్కిన్సన్ 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 247 పరుగులకే పరిమితమైంది. సిరాజ్, ప్రసిద్ కృష్ణ తలో నాలుగు వికెట్లు పడగొట్టారు. దీంతో ఇంగ్లాండ్ కు తొలి ఇన్నింగ్స్ లో 23 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్ లో జైశ్వాల్ (118) సెంచరీతో ఇండియా 396 పరుగులు చేసింది. టంగ్ ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 374 పరుగుల ఛేజింగ్ లో ఇంగ్లాండ్ 367 పరుగులకు ఆలౌటైంది.