Virat Kohli: కోహ్లీ ఎవరి కాళ్లు అయితే మొక్కారో.. అతని రికార్డులే బద్దలు కొట్టాడు

Virat Kohli: కోహ్లీ ఎవరి కాళ్లు అయితే మొక్కారో.. అతని రికార్డులే బద్దలు కొట్టాడు

ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియం వేదికగా భారత స్టార్ బ్యాటర్ విరాట్‌ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీఫైనల్‌ పోరులో శతకం బాదిన కోహ్లీ.. తాను ఆరాధించే భారత మాజీ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ రికార్డును అధిగమించాడు. వన్డేల్లో మాస్టర్ బ్లాస్టర్ 49 సెంచరీలు చేయగా.. విరాట్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. తద్వారా వన్డే చరిత్రలో 50 శతకాలు బాదిన ఏకైక బ్యాటర్‌గా అవతరించాడు. ఈ నేపథ్యంలో కోహ్లి తన రికార్డు బ్రేక్  చేయడం పట్ల సచిన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

తన రికార్డును ఓ భారతీయుడు బ్రేక్ చేయడం పట్ల సంతోషంగా ఉందన్న సచిన్.. కోహ్లీని చూసిన తొలిరోజు ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌లో చోటుచేసుకున్న ఓ చిలిపి సంఘటనను గుర్తుచేసుకున్నారు.  

"నేను ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్ లో తొలిసారి నిన్ను కలిసినప్పుడు సహచర ఆటగాళ్లు నిన్ను నా పాదాలను తాకేలా చేశారు. ఆ రోజు నవ్వు సిగ్గుపడటం చూసి నవ్వు ఆపుకోలేకపోయాను. ఆ తరువాత కొన్నాళ్లకే నువ్వు నీ పట్టుదల,నైపుణ్యంతో నా మనసును తాకావు. ఆరోజు అలా కనపడిన ఆ యువకుడు ఇప్పుడు 'విరాట్'గా ఎదిగినందుకు చాలా సంతోషంగా ఉంది." 

"ఓ భారతీయుడు నా రికార్డును బ్రేక్ చేయడానికి మించిన సంతోషం మరొకటి లేదు. అందునూ అతిపెద్ద వేదికపై .. వరల్డ్ కప్ సెమీఫైనల్ లో.. నా సొంతగడ్డపై చేయడం మరింత ఆనందంగా ఉంది.." అని సచిన్ ట్వీట్ చేశారు.