- మూడో స్థానంలో ఇషాన్ కిషన్
- ఫిలిప్స్, నీషమ్‌కు చోటు
- రా. 7 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో లైవ్
నాగ్‌పూర్: టీ20 వరల్డ్ కప్ ఆఖరి సన్నాహాలకు డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా బుధవారం తొలి మ్యాచ్ ఆడనుంది. మెగా టోర్నీకి ముందు ఈ సిరీస్‌ను డ్రెస్ రిహార్సల్‌గా భావిస్తున్న ఇండియా.. పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగనుంది. దాంతో టీమ్‌లో ఉన్న చిన్నచిన్న లోటుపాట్లను ఇక్కడే సరి చేసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో దుమ్మురేపిన ప్లేయర్లందర్ని తీసుకున్న మేనేజ్‌మెంట్.. వాళ్లను ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై కసరత్తులు మొదలుపెట్టింది. ఈ క్రమంలో సిరీస్‌ను గెలవడంతో పాటు రెండోసారి టీ20 వరల్డ్ కప్‌ను నిలబెట్టుకున్న ఏకైక జట్టుగా చరిత్ర సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2024లో సూర్య టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నప్పట్నించి జట్టు ఆటో పైలెట్ మోడ్‌లో 72 శాతం విజయాలను సొంతం చేసుకుంది. 25 మ్యాచ్‌లు ఆడితే 18సార్లు నెగ్గింది. ఈ ఫామ్‌ను అలాగే కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు ఇండియాలో ఇప్పటివరకు టీ20 సిరీస్ గెలవలేకపోయిన న్యూజిలాండ్ దాన్ని సాధించాలని పట్టుదలగా కనిపిస్తోంది. ఏడాది వ్యవధిలో టెస్ట్, వన్డే సిరీస్‌లను గెలిచిన కివీస్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉంది. 2017, 2023లో రెండుసార్లు సిరీస్ గెలుపుకు దగ్గరగా వచ్చినా 1–2తో కోల్పోయారు.
శ్రేయస్‌కు నో ప్లేస్!
ఇండియా కాకుండా ఇతర ఏ దేశంలో ఆడినా శ్రేయస్ అయ్యర్ టీ20లకు అటోమేటిక్‌గా ఎంపికయ్యే వాడు. ఎందుకంటే ఐపీఎల్‌లో అతను మూడు వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున ఆడి జట్టును ఫైనల్స్‌కు చేర్చాడు. కానీ ఇప్పుడు టీ20 సిరీస్‌లో మాత్రం అతనికి ప్లేస్ దక్కడం లేదు. గాయపడిన తిలక్ వర్మ ప్లేస్‌లో ఇషాన్ కిషన్ మూడో స్థానంలో ఆడనున్నాడు. దాంతో శ్రేయస్‌కు మొండిచెయ్యి ఎదురైంది. కెప్టెన్‌గా సూర్య సూపర్ సక్సెస్‌లో ఉన్నా బ్యాటర్‌గా ఫెయిలవుతున్నాడు. గతేడాది 19 మ్యాచ్‌ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ఓపెనింగ్‌లో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ భారీ హిట్టింగ్‌పై దృష్టి పెట్టారు. మిడిలార్డర్‌లో హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్ కీలకం కానున్నారు. ఎనిమిదో ప్లేస్ కోసం హర్షిత్ రాణా, శివమ్ దూబే మధ్య పోటీ ఉంది. పేసర్ బుమ్రా రావడంతో బౌలింగ్ మరింత బలోపేతం అయ్యింది. అర్ష్‌దీప్, కుల్దీప్ యాదవ్‌లో ఎవర్ని ఆడిస్తారో చూడాలి. వరుణ్ చక్రవర్తిని ఎక్స్ ఫ్యాక్టర్‌గా భావిస్తున్నారు. 7 నుంచి 15 ఓవర్ల మధ్య అతని బౌలింగ్ అత్యంత కీలకం కానుంది.
మిచెల్‌తోనే ప్రమాదం..
వన్డే సిరీస్ గెలిచి జోరుమీదున్న కివీస్‌ను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించే ఆల్‌రౌండర్లకు కొదవలేదు. ముఖ్యంగా డారిల్ మిచెల్ సూపర్ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. ఓపెనింగ్‌లో రాబిన్సన్, డేవన్ కాన్వే ఇచ్చే ఆరంభంపై భారీ స్కోర్లు ఆధారపడి ఉంటాయి. రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్ మిడిల్‌లో కీలకం కానున్నారు. మిచెల్ శాంట్నర్, జాకబ్ డఫీ, మ్యాట్ హెన్రీతో కూడిన పేస్ బౌలింగ్‌కు తిరుగులేదు. కాలిపిక్క గాయంతో బాధపడుతున్న మైకేల్ బ్రేస్‌వేల్ ప్లేస్‌లో జేమ్స్ నీషమ్ ఆడనున్నాడు. స్పిన్నర్ ఇష్ సోధీ ప్రభావం చూపిస్తే ఇండియన్ బ్యాటర్లకు తిప్పలు తప్పవు. ఇక 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత కివీస్ ఆడిన 21 మ్యాచ్‌ల్లో 13 గెలిచింది.
తుది జట్లు ( అంచనా)
ఇండియా: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ / శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రింకూ సింగ్, హర్షిత్ రాణా / శివమ్ దూబే, అర్ష్‌దీప్ సింగ్ / కుల్దీప్ యాదవ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
న్యూజిలాండ్: మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), టిమ్ రాబిన్సన్, డేవన్ కాన్వే, రాచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, జేమ్స్ నీషమ్, మ్యాట్ హెన్రీ, ఇష్ సోధీ, జాకబ్ డఫీ.
పిచ్, వాతావరణం
పెద్ద అవుట్ ఫీల్డ్. స్పిన్నర్లు ప్రభావం చూపించే చాన్స్ ఉంది. వాతావరణం అహ్లాదకరంగా ఉంది. వర్షం ముప్పు లేదు.
