బ్యాటింగ్ చూసి కన్నీళ్లు వచ్చాయి! భారత్ -శ్రీలంక మ్యాచ్‌పై స్పందించిన ఆనంద్ మహింద్ర

బ్యాటింగ్ చూసి కన్నీళ్లు వచ్చాయి! భారత్ -శ్రీలంక మ్యాచ్‌పై స్పందించిన ఆనంద్ మహింద్ర

గురువారం వాంఖడే వేదికగా జరిగిన భారత్ -శ్రీలంక మ్యాచ్ ఏకపక్షంగా ముగిసిన సంగతి తెలిసిందే. తొలుత భారత జట్టు 357 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో లంకేయులు 55 పరుగులకే కుప్పకూలారు. ఈ మ్యాచ్‌లో భారత పేసర్లు షమీ, సిరాజ్ జోడి పోటీపడి వికెట్లు తీస్తూ లంక ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. ఏకంగా ఐదుగురు బ్యాటర్లు ఖాతా తెరవలేదంటే ఈ జోడి ఎలాంటి బంతులేశారో అర్థం చేసుకోవాలి. ఇదే భారత పారిశ్రామికవేత్త ఆనంద్ మహింద్రాను బాధపెట్టింది. 

ఈ మ్యాచ్‌లో భారత బౌలర్ల ప్రదర్శనను మెచ్చుకున్న ఆనంద్ మహింద్ర.. శ్రీలంక ఇన్నింగ్స్ త్వరగా ముగిసిందనందుకు తాను సంతోష పడినట్లు వెల్లడించారు. "భారత బౌలర్లు లంక బ్యాటర్లను భయపెట్టారు. గతంలో వెస్టిండీస్ జట్టు పేస్ దళం ఇలానే ఉండేది. కానీ, వారు ఒకే జట్టుపై రెండు సార్లు ఇలాంటి ప్రదర్శన చేయడం నేనెన్నడూ చూడలేదు. మనోళ్లు నిజంగా శ్రీలంకకు భయానకవాతావరణం సృష్టించారు. త్వరగా మ్యాచ్ ముగియడంతో లంక బ్యాటర్ల కష్టాలు తీరినందుకు చాలా సంతోషించా.." అని ఆనంద్ మహీంద్రా ట్వీట్‌ చేశారు.

భారత్ సెమీస్‌కు.. శ్రీలంక ఇంటికి

ఈ విజయంతో భారత జట్టు అధికారికంగా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోగా.. శ్రీలంక రేసు నుంచి తప్పుకుంది. ఇప్పటివరకూ ఈ  ఇరు జట్లు ఏడు మ్యాచ్‌లు ఆడగా భారత్ అన్నింటా విజయం సాధించగా, శ్రీలంక రెండింటిలో మాత్రమే గెలుపొందింది.