గండిపేట, వెలుగు: నిర్మాణ రంగ కార్మికుల పిల్లల కోసం దేశంలోనే తొలిసారిగా ఒక ప్రత్యేక ‘వర్క్ సైట్ స్కూల్’ను సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం.రమేశ్, సీఎంసీ కమిషనర్ సృజన కలిసి నార్సింగిలోని రాజపుష్ప లేబర్ క్యాంప్‌లో సోమవారం ప్రారంభించారు. తెలంగాణ విద్యాశాఖ, మున్సిపల్ శాఖ, రాజపుష్ప ప్రాపర్టీస్ సంయుక్త భాగస్వామ్యంతో ఈ పాఠశాలను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సీపీ రమేశ్ మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న వలస కార్మికుల పిల్లలకు భరోసానివ్వడం మన బాధ్యతని, వీరికి మాతృభాషలోనే విద్యాబోధన చేయడం ద్వారా వారు త్వరగా నేర్చుకుంటారని తెలిపారు. అలాగే, అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా వీరికి మధ్యాహ్న భోజనం అందించడం అభినందనీయమన్నారు.
శాశ్వత వ్యవస్థలా కొనసాగేలా చర్యలు
జీహెచ్‌ఎంసీ కమిషనర్ సృజన మాట్లాడుతూ.. నగరాభివృద్ధిలో కేవలం రోడ్లు, మౌలిక సదుపాయాలే కాకుండా కమ్యూనిటీ డెవలప్మెంట్ను కూడా ఒక బాధ్యతగా తీసుకుంటామని, ఈ స్కూల్ ఒక శాశ్వత వ్యవస్థలా కొనసాగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ క్యాంప్‌లో జార్ఖండ్, ఒడిశా వంటి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 58 మంది పిల్లల కోసం ప్రత్యేక విద్యా వసతులు కల్పించినట్లు రాజపుష్ప ఫౌండేషన్ ప్రతినిధి పుష్పలీల వివరించారు.
రంగారెడ్డి జిల్లా విద్యాశాఖాధికారి సుశీంద్ర రావు మాట్లాడుతూ.. వలస కార్మికుల బిడ్డలందరికీ విద్యను చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్, రాజపుష్ప ఎండీ మహేందర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
