
మెక్‌కే: చిన్న టార్గెట్ ఛేజింగ్‌లో షెఫాలీ వర్మ (25 బాల్స్‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 41), మిన్ను మణి (29 బాల్స్‌లో 4 ఫోర్లతో 30) పోరాడినా.. ఆస్ట్రేలియా–ఎతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఇండియా విమెన్స్–ఎ జట్టు 4 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆసీస్ 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. టాస్ గెలిచిన ఆసీస్ 20 ఓవర్లలో 144/8 స్కోరు చేసింది. మడేలిన్ పెన్నా (39), అలీసా హీలీ (27), అనికా లియరాయిడ్ (22), సియానా జింగర్ (17 నాటౌట్) మెరుగ్గా ఆడారు. రాధా యాదవ్, ప్రేమ రావత్ చెరో మూడు వికెట్లతో కంగారూలను కట్టడి చేశారు.
తర్వాత ఛేజింగ్‌కు దిగిన ఇండియా 20 ఓవర్లలో 140/8 స్కోరుకే పరిమితమైంది. సియానా జింగెర్ (4/16) దెబ్బకు టీమిండియా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. 16 రన్స్‌కే దినేశ్ వ్రిందా (4), ఉమా ఛెత్రి (3) వికెట్లు కోల్పోయిన ఇండియాను షెఫాలీ, రాఘవి బిస్త్ (25) మూడో వికెట్‌కు 43 రన్స్ జోడించి ఆదుకున్నారు. తర్వాత వచ్చిన మిన్ను మణి.. రాఘవితో కలిసి నాలుగో వికెట్‌కు 48 రన్స్ జత చేసి గెలుపై ఆశలు పెంచారు. కానీ ఆరు బాల్స్ తేడాలో ఈ ఇద్దరు ఔట్ కావడం ఇండియాను దెబ్బతీసింది. ఈ దశలో పట్టు బిగించిన ఆసీస్ బౌలర్లు వరుస విరామాల్లో రాధా యాదవ్ (9), తనుజా కన్వర్ (1), సాజీవన్ సాజన (3)ను ఔట్ చేశారు. చివర్లో ప్రేమ రావత్ (12 నాటౌట్) పోరాడినా ప్రయోజనం దక్కలేదు.