IND vs ENG 2025: ఓవల్ టెస్ట్ మన చేతుల్లోనే.. ఇంగ్లాండ్ ముందు బిగ్ టార్గెట్ సెట్ చేసిన టీమిండియా

IND vs ENG 2025: ఓవల్ టెస్ట్ మన చేతుల్లోనే.. ఇంగ్లాండ్ ముందు బిగ్ టార్గెట్ సెట్ చేసిన టీమిండియా

ఓవల్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా ఇంగ్లాండ్ ముందు భారీ టార్గెట్ ఉంచింది. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటింగ్ లో అద్భుతంగా రాణించడంతో 396 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లాండ్ ముందు 374 పరుగుల టార్గెట్ సెట్ చేసింది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ 118 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. సుందర్ (53), జడేజా (53), ఆకాష్ దీప్ (66) హాఫ్ సెంచరీలతో రాణించారు. రెండు రోజుల ఆట మిగిలి ఉండడంతో ఈ మ్యాచ్ లో ఫలితం ఖాయంగా కనిపిస్తుంది. 

6 వికెట్ల నష్టానికి 304 పరుగులతో మూడో సెషన్ ప్రారంభించిన ఇండియా కాసేపటికే జురెల్ వికెట్ కోల్పోయింది. ఈ దశలో జడేజా, సుందర్ కాసేపు ఇంగ్లాండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ఈ క్రమంలో జడేజా తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 34 పరుగుల స్వల్ప భాగస్వామ్యం తర్వాత జడేజాతో పాటు సిరాజ్ డకౌట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసేలా కనిపించింది. అయితే ఈ దశలో సుందర్.. ప్రసిద్ కృష్ణ  సహాయంతో భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. వరుస బౌండరీలతో హోరెత్తిస్తూ 39 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టంగ్ ఐదు వికెట్లు పడగొట్టాడు. అట్కిన్సన్ మూడు వికెట్లు తీసుకోగా.. ఓవర్దన్ కు రెండు వికెట్లు దక్కాయి.   

3 వికెట్ల నష్టానికి 189 పరుగులతో రెండో సెషన్ ప్రారంభించిన టీమిండియా రెండో సెషన్ లో 115 పరుగులు చేసింది. అంతకముందు రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులతో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా తొలి సెషన్ లో 114 పరుగులు రాబట్టుకుంది. మూడో రోజు జైశ్వాల్(117) సెంచరీ.. ఆకాష్ దీప్, జడేజా, సుందర్ హాఫ్ సెంచరీలు హైలెట్ గా నిలిచాయి. తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 224 పరుగులకు ఆలౌట్ అయితే.. ఇంగ్లాండ్ 247 పరుగులు చేసింది.