
న్యూఢిల్లీ, వెలుగు: బీసీలకు 42 శాతం రిజ ర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తెచ్చి న బిల్లులను స్వాగతిస్తున్నామని ఇండియా కూటమి ఎంపీలు తెలిపారు. బీసీ బిల్లుల ఆమోదం కోసం కేంద్రంపై పోరాటం చేస్తామని చెప్పారు. బుధవారం ఢిల్లీలోని జంత ర్ మంతర్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఇండి యా కూటమి ఎంపీలు పాల్గొని మాట్లాడారు. ‘మీ వెంట మేముంటం.. బీసీ రిజర్వేషన్ల కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతాం’ అని హామీ ఇచ్చారు.
సామాజిక న్యాయం కోసమే..
బీసీ రిజర్వేషన్లు ఏ కులానినో, వర్గానినో వ్యతిరేకం కాదు. ఏ వర్గానికి చెందిన రిజర్వేషన్లు లాక్కోవడం లేదు. సామాజిక న్యాయం కోసమే బీసీ రిజర్వేషన్లు. బీసీల అభ్యున్నతి కోసం గతంలో వీపీ సింగ్ మండల్ కమిషన్ తెస్తే.. దానికి వ్యతిరేకంగా కమండల్ యాత్ర చేపట్టిన చరిత్ర బీజేపీది.
- పప్పూ యాదవ్, ఇండిపెండెంట్ ఎంపీ
తెలంగాణ తొలి అడుగు
బీసీ రిజర్వేషన్లు పెంచాలని దేశంలో ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తొలి అడుగు వేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన బిల్లులను కేంద్రం ఆమోదించాలి.
- ధర్మేంద్ర యాదవ్, ఎస్పీ ఎంపీ
బీసీల గళం బలంగా వినిపిస్తాం
మనమంతా ఢిల్లీలో ఓబీసీల గళం వినిపిస్తున్నాం. ఈ గళం ప్రధానికి వినిపించేదాకా మనం విశ్రమించొద్దు. ఓబీసీలు అందరూ ఐక్యంగా ఉండి.. తమ హక్కులు, అధికారాన్ని అడుగుతున్నారు. సడక్ నుంచి సంసద్ వరకు బీసీల గళాన్ని బలంగా వినిపిస్తాం.
- గౌరవ్ గొగొయ్, కాంగ్రెస్ ఎంపీ
కులగణనతో తెలంగాణ చరిత్ర
కులగణన చేపట్టి తెలంగాణ సర్కార్ చరిత్ర సృష్టించింది. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని పార్లమెంట్‌లో రాహుల్ డిమాండ్ చేస్తే బీజేపీ సర్కార్ అవహేళన చేసింది. కానీ ఇప్పుడు దేశవ్యాప్త కులగణన చేస్తామని దిగి వచ్చింది. తెలంగాణ ప్రకటించిన 42% బీసీ రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం.
- జ్యోతిమణి, కాంగ్రెస్ ఎంపీ