- వాషింగ్టన్ వేదికగా జరిగిన రెండో సదస్సులో సంతకాలు
- ఏఐ, సెమీకండక్టర్ల రంగాల బలోపేతానికి కృషి చేయనున్న కూటమి
- కీలక ఖనిజాల ఉత్పత్తిలో భాగస్వామ్య దేశాలకు భారీ లబ్ధి
- ప్యాక్స్ సిలికాతో అంతరాయం లేని సప్లయ్ చైన్ నిర్మాణం
న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు అంతర్జాతీయ స్థాయిలో కీలక అడుగు పడింది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా మరో 34 దేశాలు అమెరికా నేతృత్వంలో ఏర్పాటైన అంతర్జాతీయ వ్యూహాత్మక కూటమి ‘ప్యాక్స్ సిలికా’తో ఉమ్మడి ఒప్పందానికి మద్దతు తెలిపాయి.
శుక్రవారం ప్యాక్స్ సిలికా రెండో సదస్సు అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో జరిగింది. ఈ ప్రతిష్టాత్మక సదస్సులో పాల్గొన్న దేశాలన్నీ ఏఐ యుగంలో కొత్త ఆవిష్కరణలను, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించేలా చట్టబద్ధమైన నిబంధనలను రూపొందించుకోవాలని పిలుపునిస్తూ ‘జాయింట్ స్టేట్‌మెంట్ ఆన్ ఏఐ అపర్చునిటీ’ పేరుతో ఓ ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి.
ప్యాక్స్ సిలికా కూటమి పనేమిటంటే..
ఈ ఒప్పందంతో భవిష్యత్తులో ఏఐ సాంకేతికతకు అత్యంత కీలకమైన ముడిపదార్థాలు, కంప్యూటర్ చిప్స్ (సెమీకండక్టర్లు), ఇతర పరికరాల సప్లయ్ చైన్ ఎక్కడా అంతరాయం లేకుండా, నమ్మకమైన రీతిలో నిర్మించేందుకు ప్యాక్స్ సిలికా కూటమి కృషి చేయనుంది. తద్వారా కీలక ఖనిజాల ఉత్పత్తి, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి వంటి రంగాల్లో భాగస్వామ్య దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి.
కాగా, భారత్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన 'ఏఐ ఇంపాక్ట్ సదస్సు' సందర్భంగానే ప్యాక్స్ సిలికా కూటమిలో అధికారికంగా చేరగా, తాజాగా జరిగిన వాషింగ్టన్ సదస్సులో అర్జెంటీనా, జర్మనీ, నెదర్లాండ్స్, యూరోపియన్ యూనియన్ వంటి మరికొన్ని దేశాలు కొత్తగా ఈ గ్లోబల్ డిజిటల్ ప్రోగ్రాములో భాగస్వామ్యమయ్యాయి. ప్యాక్స్ సిలికా సదస్సు వేదికగా ఇండియాతో ఉన్న అనుబంధాన్ని అమెరికా ప్రత్యేకంగా ప్రస్తావించింది.
21వ శతాబ్దంలో భారత్, అమెరికా దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు ప్రపంచంలోనే అత్యంత కీలకమైనవని ఆ దేశ సాంకేతిక నిపుణుడు, ఉన్నతాధికారి జాకబ్ హెల్బర్గ్ కొనియాడారు. భారత్ తో భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారం, నాలుగు దేశాల 'క్వాడ్' కూటమి లక్ష్యాలు, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించే 'ట్రస్ట్' కార్యక్రమానికి సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలను ప్యాక్స్ సిలికా సదస్సులో ప్రధానంగా చర్చించారు.
మన దేశం తరఫున ఈ సదస్సులో కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్ పాల్గొన్నారు. ఆయనతో పాటు భారత ఐటీ రంగ నిపుణులు, ప్రముఖ పరిశ్రమల ప్రతినిధుల బృందం కూడా హాజరైంది. ఈ సందర్భంగా ప్రపంచ దేశాల దిగ్గజ టెక్నాలజీ కంపెనీల అధిపతులతో భారత ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భవిష్యత్తు సాంకేతికతకు గుండెకాయ లాంటి సెమీకండక్టర్ల తయారీ, ఏఐ అభివృద్ధి, సురక్షితమైన సాంకేతిక సరఫరా రంగాల్లో ఉమ్మడిగా కలిసి పనిచేయడంపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు.
