ఫైనల్‎కు పాకిస్తాన్‌..‌ టైటిల్‌‌ ఫైట్‌‌లో ఇండియాతో అమీతుమీ తేల్చుకోనున్న దాయాదీలు

ఫైనల్‎కు పాకిస్తాన్‌..‌ టైటిల్‌‌ ఫైట్‌‌లో ఇండియాతో అమీతుమీ తేల్చుకోనున్న దాయాదీలు

దుబాయ్‌‌: ఆసియా కప్‌‌ ఫైనల్‌‌ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌‌లో పాకిస్తాన్‌‌ జూలు విదిల్చింది. బ్యాటింగ్‌‌లో మహ్మద్‌‌ హారిస్‌‌ (31) మినహా మిగతా వారు విఫలమైనా.. బౌలర్లు సమయోచితంగా రాణించడంతో.. గురువారం జరిగిన సూపర్‌‌–4 మ్యాచ్‌‌లో పాక్‌‌ 11 రన్స్‌‌ తేడాతో బంగ్లాదేశ్‌‌ను ఓడించి టైటిల్ ఫైట్‌‌కు అర్హత సాధించింది. టాస్‌‌ ఓడిన పాకిస్తాన్‌‌ 20 ఓవర్లలో 135/8 స్కోరు చేసింది. ఆరంభం నుంచే చెలరేగిన బంగ్లా బౌలర్లు పాక్‌‌ బ్యాటర్లను కట్టడి చేశారు. 

టస్కిన్‌‌ అహ్మద్‌‌ (3/28), మెహిదీ హసన్‌‌ (2/28), రిషాద్‌‌ హుస్సేన్‌‌ (2/18) సమయోచితంగా బౌలింగ్‌‌ చేశారు. కీలక టైమ్‌‌లో వికెట్లు తీసి స్కోరు బోర్డుకు కళ్లెం వేశారు. ఇన్నింగ్స్‌‌ నాలుగో బాల్‌‌కే సాహిబ్జాదా ఫర్హాన్ (4), రెండో ఓవర్‌‌లో సైమ్‌‌ అయూబ్‌‌ (0) వెనుదిరిగారు. ఫకర్‌‌ జమాన్‌‌ (13), సల్మాన్‌‌ ఆగా (19) మూడో వికెట్‌‌కు 24 రన్స్‌‌ జోడించి ఇన్నింగ్స్‌‌ను నిలబెట్టే ప్రయత్నం చేసినా సక్సెస్‌‌ కాలేదు.

ఏడో ఓవర్‌‌లో జమాన్‌‌ ఔట్‌‌తో మొదలైన వికెట్ల పతనం ఎక్కడ ఆగలేదు. వరుస విరామాల్లో హుస్సేన్‌‌ తలత్‌‌ (3), సల్మాన్‌‌ ఆగా ఔట్‌‌ కావడంతో పాక్‌‌ 49 రన్స్‌‌కే సగం జట్టు పెవిలియన్‌‌కు చేరింది. ఈ దశలో మహ్మద్‌‌ హారిస్‌‌ బ్యాట్‌‌ అడ్డేశాడు. రెండో ఎండ్‌‌లో షాహిన్‌‌ ఆఫ్రిది (19) అండగా నిలిచాడు. 

ఆరో వికెట్‌‌కు 22 రన్స్‌‌ జత చేసి వెనుదిరిగాడు. హారిస్‌‌తో జత కలిసిన మహ్మద్‌‌ నవాజ్‌‌ (25) ధనాధన్‌‌ బ్యాటింగ్‌‌తో చెలరేగాడు. ఏడో వికెట్‌‌కు 38 రన్స్‌‌ జోడించి ఏడు బాల్స్‌‌ తేడాలో ఈ ఇద్దరు ఔటయ్యారు. చివర్లో ఫహీమ్‌‌ అష్రాఫ్‌‌ (14 నాటౌట్‌‌), హారిస్‌‌ రవూఫ్‌‌ (3 నాటౌట్‌‌) వేగంగా ఆడటంతో పాక్‌‌ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. 

పోరాడి ఓడిన బంగ్లా..

చిన్న ఛేజింగ్‌‌లో బంగ్లాదేశ్‌‌ 20  ఓవర్లలో 124/9  స్కోరుకే పరిమితమైంది. షామిమ్‌‌ హుస్సేన్‌‌ (30) మినహా మిగతా వారు పాక్‌‌ బౌలర్ల ధాటికి బెంబేలెత్తారు. ఇన్నింగ్స్‌‌ ఐదో బాల్‌‌కే షాహిన్‌‌ (3/17) పర్వేజ్‌‌ హుస్సేన్‌‌ ఎమన్‌‌ (0)ను డకౌట్‌‌ చేశాడు. సైఫ్‌‌ హసన్‌‌ (18)తో కలిసిన తౌహిద్‌‌ హ్రిదోయ్‌‌ (5) రెండో వికెట్‌‌కు 22 రన్స్‌‌ జోడించి వెనుదిరిగాడు. ఆ వెంటనే ఆరు, ఎనిమిదో ఓవర్స్‌‌లో వరుసగా సైఫ్‌‌ హసన్‌‌, మెహిదీ హసన్‌‌ (11) పెవిలియన్‌‌కు చేరారు. 

ఈ క్రమంలో బంగ్లా 9.2 ఓవర్లలో 50 రన్స్‌‌కు చేరుకున్నా వికెట్ల పతనం మాత్రం ఆగలేదు. 12వ ఓవర్‌‌లో నురుల్‌‌ హుస్సేన్‌‌ (16) ఔట్‌‌ కావడంతో బంగ్లా 63/5తో ఎదురీత మొదలుపెట్టింది. ఈ దశలో షామిమ్‌‌ హుస్సేన్‌‌ రెండు కీలక భాగస్వామ్యాలతో ఇన్నింగ్స్‌‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు.

జాకెర్‌‌ అలీ (5)తో ఆరో వికెట్‌‌కు 10 రన్స్‌‌ జోడించిన షామిమ్‌‌.. తన్జిద్‌‌ హసన్‌‌ షకీబ్‌‌ (10)తో ఏడో వికెట్‌‌కు 24 రన్స్‌‌ జత చేసి ఔటయ్యాడు. చివర్లో రిషాద్‌‌ హుస్సేన్‌‌ (16 నాటౌట్‌‌), ముస్తాఫిజుర్‌‌ (6 నాటౌట్‌‌) పోరాడినా తృటిలో ఓటమి తప్పలేదు. షాహిన్‌‌ ఆఫ్రిదికు ‘ప్లేయర్‌‌ ఆప్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. 

సంక్షిప్త స్కోర్లు

పాకిస్తాన్‌‌: 20 ఓవర్లలో 135/8 (మహ్మద్‌‌ హారిస్‌‌ 31, మహ్మద్‌‌ నవాజ్‌‌ 25, టస్కిన్‌‌ అహ్మద్‌‌ 3/28). 
బంగ్లాదేశ్‌‌: 20 ఓవర్లలో 124/9 (షామిమ్‌‌ హుస్సేన్‌‌ 30, షాహిన్‌‌ ఆఫ్రిది 3/17, రవూఫ్‌‌ 3/33).