భారత్, బంగ్లా మ్యాచ్ రద్దు.. చివర్లో టీమిండియా విజయాన్ని అడ్డుకున్న వరుణుడు..!

భారత్, బంగ్లా మ్యాచ్ రద్దు.. చివర్లో టీమిండియా విజయాన్ని అడ్డుకున్న వరుణుడు..!

ముంబై: ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్‎లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన చివరి లీగ్ మ్యాచ్ రద్దు అయ్యింది. వర్షం కారణంగా ఆటను రద్దు చేస్తున్నట్లు మ్యాచ్ అఫిషియల్స్ ప్రకటించారు. దీంతో గెలుపు ముంగిట వరుణుడు ఇండియా విజయాన్ని అడ్డుకున్నట్లైంది. లీగ్ దశను గెలుపుతో ముగిద్దామనుకున్నా ఇండియా అమ్మాయిలకు నిరాశ ఎదురైంది.

ఆదివారం (అక్టోబర్ 26) నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచులో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బంగ్లా బ్యాటింగ్ సమయంలో వర్షం అడ్డుతగలడంతో మ్యాచ్‎ను 27 ఓవర్లకు కుదించారు. ఇండియా బౌలర్లు చెలరేగడంతో బంగ్లా నిర్ణీత 27 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. షర్మిన్ అక్తర్ (37), శోభన మోస్తరీ (26) తప్ప మిగిలిన బ్యాటర్లంతా విఫలం కావడంతో బంగ్లా తక్కువ స్కోర్‎కే పరిమితమైంది.

రాధా యాదవ్ మూడు వికెట్లతో రాణించగా.. శ్రీచరణి, రేణుకా సింగ్, దీప్తి శర్మ, అమన్‎జోత్ కౌర్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం డక్ వర్త్ లూయిస్ మెథడ్ (డీఎల్ఎస్)లో ఇండియా టార్గె్ట్‎ను 126 రన్స్‎గా నిర్దేశించారు మ్యాచ్ అఫిషియల్స్. 126 పరుగుల స్వల్ప లక్ష్యంతో ఇండియా బరిలోకి దిగింది. రెగ్యులర్ ఓపెనర్ ప్రతీకా రావల్ గాయపడటంతో అమన్ జోత్ కౌర్‎తో కలిసి స్మృతి మందాన భారత ఇన్నింగ్స్ ప్రారంభించింది. 

స్వల్ప లక్ష్య ఛేదనలో స్మృతి (34) బంగ్లా బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. అమన్ జోత్ కౌర్ (15) స్మృతికి సపోర్ట్ చేసింది. ఇండియా 8.4 ఓవర్లలో 57 పరుగులు చేసిన దశలో మరోసారి వర్షం అడ్డుతగిలింది. వర్షం తగ్గుముఖం పట్టేలా కనిపించకపోవడంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు అఫిషియల్స్. దీంతో ఫలితం తేలకుండానే బంగ్లా, భారత్ మధ్య చివరి లీగ్ మ్యాచ్ ముగిసింది.