చహర్​..సూపర్​: ఓడిపోయే మ్యాచ్ ను గెలిపించాడు

చహర్​..సూపర్​: ఓడిపోయే మ్యాచ్ ను గెలిపించాడు

కొలంబో: కండ్ల ముందు భారీ టార్గెట్‌‌‌‌ ఉన్నా.. సీనియర్లు ఓ మాదిరి స్కోర్లకే ఔటైనా.. లోయర్‌‌ ఆర్డర్‌‌లో ఒంటరి పోరాటం చేసిన దీపక్‌‌ చహర్‌‌ (82 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 69 నాటౌట్‌‌) టీమిండియాకు అద్భుత విజయం అందించాడు. భువనేశ్వర్‌‌ (19 నాటౌట్‌‌)తో కలిసి లంక బౌలింగ్‌‌ను దీటుగా ఎదుర్కొంటూ.. విజయానికి అవసరమైన రన్స్‌‌ జోడించాడు. దీంతో మంగళవారం జరిగిన సెకండ్‌‌ వన్డేలో ఇండియా 3 వికెట్ల తేడాతో లంకపై గెలిచింది. ఫలితంగా మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌ను మరోటి మిగిలి ఉండగానే 2–0తో కైవసం చేసుకుంది. 276 రన్స్‌‌ టార్గెట్‌‌ ఛేదించే క్రమంలో ఇండియా 49.1 ఓవర్లలో 7 వికెట్లకు 277 రన్స్‌‌ చేసి గెలిచింది. పృథ్వీ షా (13), ధవన్‌‌ (29), ఇషాన్‌‌ కిషన్‌‌ (1) నిరాశపర్చారు. దీంతో12 ఓవర్లకే 65/3 స్కోరుతో కష్టాల్లో పడిన టీమిండియాను గట్టెక్కించే బాధ్యత మనీశ్‌‌ పాండే (37), సూర్యకుమార్‌‌ యాదవ్‌‌ (53)పై పడింది. ఈ ఇద్దరు లంక బౌలింగ్‌‌ దీటుగా ఎదుర్కొంటూ క్రమంగా ఇన్నింగ్స్‌‌ను గాడిలో పెట్టారు. అయితే 18వ ఓవర్‌‌లో ఇండియాకు డబుల్‌‌ షాక్‌‌ తగిలింది. షనక వేసిన ఈ ఓవర్‌‌ సెకండ్‌‌ బాల్‌‌కు  పాండే అనూహ్యంగా రనౌట్‌‌ కాగా, లాస్ట్‌‌ బాల్‌‌కు హార్దిక్‌‌ (0) డకౌటయ్యాడు. నాలుగో వికెట్‌‌కు 50 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. ఈ దశలో క్రునాల్‌‌ పాండ్యా (35) మంచి సమన్వయం అందించాడు. 42 బాల్స్‌‌లో ఫిఫ్టీ కంప్లీట్‌‌ చేసిన సూర్య.. ఆరో వికెట్‌‌కు 44 రన్స్‌‌ జత చేసి వెనుదిరిగాడు. చహర్‌‌తో ఏడో వికెట్‌‌కు 33 రన్స్‌‌ చేసి క్రునాల్‌‌ ఔటయ్యాడు. ఇక 14.5 ఓవర్లలో 83 రన్స్‌‌ చేయాల్సిన దశలో చహర్‌‌, భువీ అద్భుతం చేశారు. చహర్​కే ప్లేయర్​ ఆఫ్​ ద మ్యాచ్​ అవార్డు దక్కింది. ఇరు జట్ల మూడో వన్డే  శుక్రవారం జరగనుంది.
రాణించిన అవిష్క, చరిత్​  
అంతకుముందు టాస్‌‌ గెలిచి బ్యాటింగ్‌‌కు దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 275 రన్స్‌‌ చేసింది. ఆవిష్క ఫెర్నాండో (50), చరిత్ అసలంకా (65) హాఫ్‌‌ సెంచరీలతో రాణించారు. ఓపెనర్లు ఫెర్నాండో, మినోద్‌‌ (36).. ఫస్ట్‌‌ టెన్‌‌ ఓవర్స్‌‌లో టీమ్‌‌ స్కోరును 59 రన్స్‌‌కు చేర్చారు. కానీ ఈ దశలో బౌలింగ్‌‌కు వచ్చిన చహల్‌‌ (3/50) లంక జోరుకు బ్రేక్​ వేశాడు. 14వ ఓవర్‌‌లో వరుస బాల్స్‌‌లో మినోద్, రాజపక్స (0)ను ఔట్‌‌ చేసి షాకిచ్చాడు. క్రీజులో పాతుకుపోయిన ఫెర్నాండో, ధనంజయ డిసిల్వ (32) అనుకున్నంత వేగంగా ఆడలేకపోయారు. దీంతో 14వ ఓవర్‌‌లో 77/1తో ఉన్న స్కోరు.. 28వ ఓవర్‌‌కు 134/4గా మారింది. ఈ దశలో అసలంక, కెప్టెన్ షనక (16) ఇన్నింగ్స్‌‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఐదో వికెట్‌‌కు 38 రన్స్‌‌ జోడించిన తర్వాత కెప్టెన్‌‌ను.. చహల్‌‌ పెవిలియన్‌‌కు పంపాడు. కొద్దిసేపటికే హసరంగ (8)ను చహర్‌‌ (2/53) వెనక్కి పంపాడు. అయితే చివర్లో చమిక కరుణరత్నె (44 నాటౌట్‌‌), అసలంక వేగంగా ఆడారు. ఈ ఇద్దరు కలిసి ఏడో వికెట్‌‌కు 50 రన్స్‌‌ జోడించడంతో లంక స్కోరు 250కి చేరుకుంది. 

సంక్షిప్త స్కోర్లు
శ్రీలంక: 50 ఓవర్లలో 275/9 (చరిత్‌‌‌‌ 65, అవిష్క 50, చహల్‌‌ 3/50, భువనేశ్వర్‌‌ 3/54, దీపక్‌‌ 2/53)
ఇండియా: 49.1 ఓవర్లో 277/7 (దీపక్‌‌ 69 నాటౌట్, సూర్యకుమార్‌‌ 53, హసరంగ 3/37)