
లండన్: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా జట్టులో ఓ ప్లేయర్ కరోనా బారిన పడ్డాడు. కొవిడ్ పాజిటివ్‌గా తేలిన ఆ ప్లేయర్ పేరు బయటకు వెల్లడించుకున్నా.. ప్రస్తుతం అతడు తన బంధువుల ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నట్లు సమాచారం. అయితే ఆ ఆటగాడు వికెట్ కీపర్ రిషబ్ పంత్ అని తెలుస్తోంది. స్వల్ప గొంతు నొప్పిగా ఉండటంతో పంత్‌కు కరోనా పరీక్షలు చేశారు. వీటిలో అతడికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. పంత్‌తో సన్నిహితంగా ఉన్న జట్టు సభ్యులను, సిబ్బందిని మూడ్రోజుల పాటు ఐసోలేషన్‌కు వెళ్లమని వైద్య సిబ్బంది సూచించగా.. ఆ గడువు ముగిసింది. దీంతో గురువారం పంత్ మినహా మిగతా వాళ్లంతా డర్హమ్‌కు బయలుదేరనున్నారు.
కరోనా సోకిన పంత్‌కు తీవ్రమైన లక్షణాలు లేవని తెలిసింది. ఈ విషయం తెలిసిన బీసీసీఐ సెక్రటరీ జై షా అప్రమత్తంగా ఉండాలని ఆటగాళ్లకు ఓ మెయిల్ పంపారు. డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్నందున బయటకు వెళ్లొద్దని ప్లేయర్లను ఆ మెయిల్‌లో వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. కాగా, ఇంగ్లాండ్‌తో ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 వరకూ ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ జట్టు ఆడనుండగా.. ఈ సిరీస్‌కి ముందు భారత క్రికెటర్లకి 20 రోజుల బ్రేక్ ఇచ్చారు. ఈ విరామ సమయంలో కొందరు క్రికెటర్లు వింబుల్డన్, యూరో కప్ మ్యాచ్‌లను చూసేందుకు వెళ్లారు. ఇలా వెళ్లిన పంత్‌కు తాజాగా కరోనా పాజిటివ్‌గా తేలడంతో.. టీమిండియా మేనేజ్‌మెంట్ అలెర్ట్ అయ్యింది.