564 రన్స్ వద్ద భారత్ డిక్లేర్.. సలీమ్ సఫీ ‘6’ వికెట్లతో ఊచకోత.. ఇక ఆఫ్ఘన్ బ్యాటింగ్ షూరూ!

564 రన్స్ వద్ద భారత్ డిక్లేర్.. సలీమ్ సఫీ ‘6’ వికెట్లతో ఊచకోత.. ఇక ఆఫ్ఘన్ బ్యాటింగ్ షూరూ!

IND vs AFG Test: న్యూ ఛండీగఢ్ లో ఆఫ్ఘనిస్థాన్ తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ రెండోరోజు మస్త్ రసవత్తరంగా మారిపోయింది. తొలి రోజు ఆఫ్ఘన్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న ఇండియన్ బ్యాటర్లు.. రెండో రోజు మాత్రం ఆఫ్ఘనిస్థాన్ జట్టు గట్టి షాకులే ఇచ్చింది. సెకండ్ డే మొదటి సెషన్ లో వెంటవెంటనే కీలకమైన మూడు వికెట్లని పడగొట్టి మనోళ్లపై పట్టు సాధించింది. ఆ తర్వాత భారత్ 564 పరుగులు వద్ద తొలి ఇన్సింగ్స్ ని డిక్లేర్ చేసింది. 

నిన్న (శనివారం) శతకంతో చెలరేగిన కెప్టెన్ శుభ్ మన్ గిల్.. రెండో రోజు కూడా ఇన్సింగ్స్ ని భారీ స్కోర్ వైపు ఉరికిస్తున్న సమయంలోనే ఆఫ్ఘన్ బౌలర్ సలీమ్ సఫీ గట్టి షాక్ ఇచ్చాడు. గిల్ 126 రన్స్ వద్ద సఫీ బౌలింగ్ లోనే మైదానం వీడాడు. ఆ వెంటనే వచ్చిన ధ్రువ్ జురెల్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు.. సలీమ్ బౌలింగ్ లోనే డకౌట్ కి చేరుకున్నాడు. శనివారం అర్థ శతకంతో మంచి ఊపుమీదున్న రిషభ్ పంత్.. ఈరోజు సెంచరీ దిశగా వెళ్తుండగా 81 రన్స్ మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఇక ఆ తర్వాత వచ్చిన డెబ్యూ ప్లేయర్ మానవ్ సుతార్ కేవలం 28 పరుగులు మాత్రమే చేసి సలీమ్ సఫీ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయ్యాడు. 

అనంతరం క్రీజులోకి వచ్చిన డీఎస్పీ మహమ్మద్ సిరాజ్ మాత్రం క్రీజులోకి వచ్చి రావడంతోనే ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లపై ఎదురుదాడి మొదలు పెట్టాడు. జస్ట్ 12 బంతుల్లోనే 22 పరుగులు కొట్టి సలీమ్ సఫీ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కానీ మరో ఎండ్ లో ఉన్న వాషింగ్టన్ సుందర్, ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ, తాను మాత్రం నిలకడగా బ్యాటింగ్ చేస్తూ, హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్న తర్వాత కెప్టెన్ గిల్ ఇన్సింగ్స్ ని డిక్లేర్ చేశాడు. కాగా ఈ ఇన్సింగ్స లో ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లలో సలీమ్ సఫీ ఒక్కడే 6 వికెట్లు పడగొట్టి భారత జట్టు నడ్డి విరిచాడు, మిగతా బౌలర్లలో జియావుర్ రెహమాన్, హష్మతుల్లా షాహిదిలకి తలో వికెట్ దక్కింది. 

టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్న భారత జట్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్ కలిసి రెండో వికెట్ కి ఏకంగా 139 పరుగులు జోడించారు. ఇక 81 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సుదర్శన్ పెవిలియన్ కి చేరగా, కేఎల్ రాహుల్ మాత్రం అదిరిపోయే క్లాస్ బ్యాటింగ్ లో తన టెస్ట్ కెరీర్ లో 12వ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు.