
మాంచెస్టర్: ఆఖరి రోజు అసాధారణ పోరాట పటిమ చూపెట్టిన టీమిండియా.. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌లో ఓటమి తప్పించుకుంది. బౌలర్ల వైఫల్యంతో ఓటమి వైపు వెళ్లిన మ్యాచ్‌ను బ్యాటర్లు డ్రాతో గట్టెక్కించారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (238 బాల్స్‌లో 12 ఫోర్లతో 103), రవీంద్ర జడేజా (185 బాల్స్‌లో 13 ఫోర్లతో 1 సిక్స్‌తో 107 నాటౌట్), వాషింగ్టన్ సుందర్ (206 బాల్స్‌లో 9 ఫోర్లు, 1 సిక్స్‌తో 101 నాటౌట్) వీరోచిత సెంచరీలకు తోడు కేఎల్ రాహుల్ (230 బాల్స్‌లో 8 ఫోర్లతో 90) పోరాడటంతో.. 174/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఐదో రోజు ఆట కొనసాగించిన ఇండియా మ్యాచ్ చివరకు రెండో ఇన్నింగ్స్‌లో 143 ఓవర్లలో 425/4 స్కోరు చేసింది.
ఫలితంగా 114 రన్స్ లీడ్‌ను సాధించారు. మ్యాచ్‌కు మరో గంట టైమ్ మాత్రమే మిగిలి ఉండటంతో ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ డ్రాకు అంగీకరించాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2–1 ఆధిక్యంలో కొనసాగుతోంది. స్టోక్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య ఆఖరిదైన ఐదో టెస్ట్ ఈ నెల 31 నుంచి ఓవల్‌లో జరుగుతుంది.
గిల్ సెంచరీ..
137 రన్స్ లోటుతో ఆదివారం ఆట మొదలుపెట్టిన రాహుల్, గిల్ నాలుగో రోజు పోరాటం కొనసాగించారు. కుడి భుజం, కాలి కండరాల నొప్పితో బౌలింగ్‌కు అంత ఫిట్‌గా లేని స్టోక్స్ ఉదయం ఎనిమిది ఓవర్ల స్పెల్ వేసి గిల్‌ను కాస్త ఇబ్బందిపెట్టాడు. లైన్ అండ్ లెంగ్త్‌తో పాటు బాల్‌ను రెండు వైపుల స్వింగ్ చేసిన స్టోక్స్ తొలి గంటలోనే ఫలితాన్ని అందించాడు. ఇన్నింగ్స్ 71వ ఓవర్‌లో లెంగ్త్ బాల్‌తో రాహుల్‌ను వికెట్ల ముందు దొరకబట్టాడు. బాల్ మోకాలి ఎత్తులోనే రావడంతో లైన్ తప్పిన రాహుల్ క్లియర్ ఎల్బీ అయ్యాడు.
ఫలితంగా మూడో వికెట్‌కు 180 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో వచ్చిన జడేజా కూడా గిల్‌కు మంచి సహకారం అందించాడు. రెండో ఎండ్‌లో గిల్ 228 బాల్స్‌లో నాలుగో సెంచరీ పూర్తి చేశాడు. 80 ఓవర్ల తర్వాత కొత్త బంతి రావడంతో ఇండియాకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఆర్చర్, వోక్స్ ఫుల్ స్వింగ్‌తో రెండు వైపుల నుంచి దాడులు పెంచారు. ఈ వ్యూహం ఎనిమిది ఓవర్ల తర్వాత ఫలించింది. ఆర్చర్ వేసిన షార్ట్ ఆఫ్ లెంగ్త్ డెలివరీ గిల్ బ్యాట్ అంచును తాకుతూ కీపర్ చేతుల్లోకి వెళ్లింది.
తాను ఔటయ్యే సమయానికి ఇండియా ఇంకా 88 రన్స్ వెనకబడి ఉండటంతో గిల్ నిరాశగా వెనుదిరిగాడు. ఆ వెంటనే జడ్డూ ఇచ్చిన క్యాచ్‌ను ఫస్ట్ స్లిప్‌లో రూట్ అందుకోలేకపోయాడు. వాషింగ్టన్ సుందర్ రాకతో స్టోక్స్, స్పిన్నర్ డాసన్ బౌలింగ్‌కు దిగారు. డాసన్ కఠినమైన ప్రదేశాల్లో బాల్‌ను వేస్తూ మంచి టర్నింగ్ రాబడుతూ సుందర్‌కు సవాల్ విసిరాడు. దీన్ని అడ్డుకునేందుకు సుందర్ డెడ్ డిఫెన్స్‌కు ప్రాధాన్యమిచ్చాడు. ఓవరాల్‌గా ఈ సెషన్‌లో ఇండియా 17 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 49 రన్స్ మాత్రమే చేసింది. 223/4తో లంచ్‌కు వెళ్లింది.
జడ్డూ–సుందర్ సూపర్ డిఫెన్స్
మ్యాచ్‌ను ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో పాటు గాయపడిన రిషబ్ పంత్‌ను బ్యాటింగ్‌కు రాకుండా చూడాలనే బాధ్యతతో జడేజా, సుందర్ లంచ్ తర్వాత మరింత వీరోచిత పోరాటం చేశారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేయడంతో డ్రాపై ఆశలు బలపడ్డాయి. ఓ ఓవర్‌లో సుందర్ ఏకంగా సిక్స్ సహా 15 రన్స్ రాబట్టడంతో ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. ఈ క్రమంలో 117 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. రెండో ఎండ్‌లో జడేజా కూడా సిక్స్‌తో 86 బాల్స్‌లో హాఫ్ మార్క్ అందుకున్నాడు.
ఇద్దరు లెఫ్ట్యాండర్స్ క్రీజులో ఉండటంతో లెఫ్టార్మ్ స్పిన్నర్ డాసన్ చాలెంజ్ విసరలేకపోయాడు. ఆర్చర్ స్వింగ్ రాబట్టినా సక్సెస్ కాలేదు. దాంతో వికెట్ పడే చాన్సెస్ గణనీయంగా తగ్గాయి. రెండో కొత్త బాల్‌తో 38 ఓవర్లు వేయడంతో అది కూడా పాతబడింది. ఫలితంగా బ్యాటింగ్‌కు సులువుగా మారింది. ఈ సెషన్‌లో వికెట్ ఇవ్వకుండా 99 రన్స్ జోడించడంతో టీ వరకు ఇండియా 322/4 చేసింది. ఫలితంగా 11 రన్స్ లీడ్‌లోకి వెళ్లింది. ఇక మూడో సెషన్‌లోనూ సుందర్, జడేజా ఆధిపత్యమే కొనసాగింది.
స్టోక్స్ ఎన్ని రకాల వ్యూహాలు పన్నినా, బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అద్భుతమైన డిఫెన్స్‌తో జడ్డూ–సుందర్ జోడీ అడ్డుగోడ కట్టింది. ఫలితంగా ఇంగ్లండ్‌కు ఒక్క రివ్యూ చాన్స్ కూడా ఇవ్వలేదు. ఇక బ్రూక్ బౌలింగ్‌లో సిక్స్‌తో 182 బాల్స్‌లో జడేజా సెంచరీ చేశాడు. తన కెరీర్‌లో ఇది ఐదోది కాగా, ఇంగ్లండ్‌పై మూడోది. బ్రూక్ తర్వాతి ఓవర్‌లో సుందర్ 206 బాల్స్‌లో కెరీర్‌లో తొలి టెస్ట్ సెంచరీ అందుకున్నాడు. ఈ ఇద్దరు ఐదో వికెట్‌కు అజేయంగా 203 రన్స్ జోడించారు. వోక్స్ 2, ఆర్చర్, స్టోక్స్ చెరో వికెట్ తీశారు.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా తొలి ఇన్నింగ్స్: 358 ఆలౌట్. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 669 ఆలౌట్. ఇండియా రెండో ఇన్నింగ్స్: 143 ఓవర్లలో 425/4 (గిల్ 103, సుందర్ 101*, జడేజా 107*, వోక్స్ 2/67).
1ఇంగ్లండ్‌లో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అత్యధిక రన్స్ (700) చేసిన తొలి ఆసియా బ్యాటర్ శుభ్‌మన్ గిల్.
2 టెస్ట్ కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే అత్యధిక రన్స్ చేసిన రెండో బ్యాటర్ గిల్ (722). బ్రాడ్‌మన్ (810) టాప్‌లో ఉన్నాడు.
3 టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే సిరీస్‌లో నాలుగు సెంచరీలు చేసిన మూడో కెప్టెన్ గిల్. బ్రాడ్‌మన్ (ఇండియాపై 4), సునీల్ గావస్కర్ (వెస్టిండీస్‌పై 4) రికార్డును
సమం చేశాడు.
4ఒక టెస్ట్ సిరీస్‌లో ఎక్కువ సెంచరీలు చేసిన నాలుగో ఇండియన్ ప్లేయర్‌గా గిల్ (4 సెంచరీలు).. గావస్కర్ (4), కోహ్లీ (4)తో సమంగా నిలిచాడు.