ఇజ్రాయెల్ ​ఎంబసీ వద్ద భద్రత కట్టుదిట్టం

ఇజ్రాయెల్ ​ఎంబసీ వద్ద భద్రత కట్టుదిట్టం
  • ఇజ్రాయెల్​ఎంబసీ వద్ద భద్రత కట్టుదిట్టం
  • పేలుడు జరిగిన చోట లేఖ లభ్యం
  • ఇద్దరు అనుమానితులను గుర్తించినట్లు పోలీసుల వెల్లడి

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని చాణక్యపురిలో ఇజ్రాయెల్​ రాయబార కార్యాలయం వద్ద పేలుడు ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పేలుడు జరిగిన ప్రాంతంలో ఓ లేఖ లభ్యమైందని, దానిని నిశితంగా పరిశీలిస్తున్నామని వివరించారు. మంగళవారం సాయంత్రం ఇజ్రాయెల్​ ఎంబసీ వద్ద జరిగిన పేలుడుతో అధికార వర్గాలు ఉలిక్కిపడ్డాయి. ఎన్ఎస్​జీ, ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలాన్ని సందర్శించి కొన్ని ఆధారాలు సేకరించారు. రెండు జాగిలాలతో ఎన్ఎస్​జీ  డాగ్ స్క్వాడ్ బృందం సమీపంలో సోదాలు చేపట్టింది. 

ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు రాయబార కార్యాలయం వద్ద తచ్చాడినట్లు సీసీ కెమెరాల్లో గుర్తించారు. ఎంబసీ సమీపంలో ‘సర్​ అల్లాహ్​ రెజిస్టెన్స్’ పేరుతో ఇజ్రాయెల్​ జాతీయ పతాకం, దానిలో ఓ లేఖ కూడా లభించినట్లు తెలుస్తున్నది. ఆ లేఖలో ఇంగ్లీషులో ఇజ్రాయెల్, పాలస్తీనా, గాజా వంటి పదాలు ఉన్నట్లు పోలీస్ ​వర్గాలు తెలిపాయి. పేలుడు సంభవించిన తర్వాత పోలీసులు ఢిల్లీలో పారామిలటరీ బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా, పేలుడుకు ముందు ఇజ్రాయెల్​ఎంబసీ చుట్టుపక్కల ఏయే నెంబర్లు యాక్టివ్​లో ఉన్నాయి. ఆ కాల్స్​లో ఏం సంభాషణ జరిగిందనే విషయాలు తెలుసుకోవడంపై పోలీసులు దృష్టి పెట్టినట్లు తెలుస్తున్నది.